ఆవేశానికి లోనై సభలో తొడగొట్టిన ఏపీ మంత్రి అనిల్…

0
106

అసెంబ్లీలో అప్పుడప్పుడు ఆవేశంగా మాట్లాడే ఏపీ సాగునీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్… తాజాగా శాసనమండలిలోనూ ఆవేశానికి లోనయ్యారు. టీడీపీ ఎమ్మెల్సీ నాగ జగదీశ్వర్ రావు, మంత్రి అనిల్ మధ్య శాసనమండలిలో కొద్దిసేపు వాగ్వాదం నడిచింది. ఈ సందర్భంగా ఆవేశానికి లోనైన మంత్రి అనిల్… సభలో తొడగొట్టారు. ముందుగా మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టు అంశాన్ని టీడీపీ సభ్యుడు నాగ జగదీశ్వర్ రావు సభలో లేవనెత్తారు. బీసీ నాయకులను అనగదొక్కుతున్నారని ఆరోపించారు. అయితే ఆయన వ్యాఖ్యలను మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తప్పుబట్టారు.

అచ్చెన్నాయుడు దొంగతనం చేశాడు కాబట్టే జైలుకు వెళ్లాడని వ్యాఖ్యానించారు. ఈ అంశంలో కల్పించుకున్న మంత్రి అనిల్ యాదవ్.. ముద్రగడ పద్మనాభం విషయాన్ని ప్రస్తావించారు. కాపు ఉద్యమ సమయంలో మూడువేల మంది పోలీసులతో ఆయన్ను అరెస్ట్ చేయడాన్ని ఎలా భావించాలని ప్రశ్నించారు. దీంతో ప్రతిపక్ష టీడీపీ ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. దీంతో మంత్రి అనిల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సభలో తొడగొట్టారు. తనను ఓడించడానికి ఎన్నికల్లో కోట్లు ఖర్చుపెట్టారని… అయినా తాను గెలిచి సభకు వచ్చానని అన్నారు. అధికార విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో మండలి చైర్మన్ సభను వాయిదా వేశారు.