అది జూన్ 14 రాత్రి 10 అయ్యింది. త్వరలోనే సూర్యాపేటలోని ఇంటికి వెళ్లాలనుకున్న కల్నల్ సంతోష్ బాబు… బోర్డర్ నుంచి తమ వారికి కాల్ చేశాడు. ఆ సంభాషణ మధ్యలో… “సరిహద్దుల్లో పరిస్థితి ఎలా ఉంది?” అని తల్లిదండ్రులు అడిగారు. దానికి కల్నల్ ఏమన్నాడో తెలుసా?… “మీరు ఇలా అడగకూడదు. నేను చెప్పకూడదు… నేను ఇంటికొచ్చాక మాట్లాడుకుందాం” అన్నాడు. అంతే గానీ… సైనిక రహస్యాల్నీ, సరిహద్దుల్లో పరిస్థితులనూ ఫోన్‌లో చెప్పలేదు. తద్వారా ఆయన దేశభక్తిని చాటుకున్నాడు. ఒకవేళ ఫోన్‌లో ఇలాంటి విషయాలు చెబితే… ఎవరైనా ఆ ఫొన్ కాల్‌ను ట్యాంపరింగ్ చేస్తే… అది దేశ భద్రతకే ముప్పుగా మారే ప్రమాదం ఉంటుంది. అందుకే సంతోష్ బాబు అలా చేశాడు. కానీ… ఇప్పుడు కోట్లాది భారతీయుల గుండెల్లో అమరజీవిగా ఇంటికి వస్తున్నాడు కల్నల్ సంతోష్ బాబు.
ఇండియన్ వింగ్ కమాండర్ అభినందన వర్ధమాన్ కూడా… ఇదే విధంగా దేశభక్తిని చాటుకున్నాడు. పాకిస్థాన్ సైన్యం ఆయన్ని బంధించినప్పుడు… ఓ ప్రశ్న వేసింది. సైనిక రహస్యాల్ని చెప్పమని కోరింది. నా ప్రాణాలు తీసినా… ఆ రహస్యాలు మాత్రం చెప్పను అని ధైర్యంగా చెప్పారు. దాంతో పాకిస్థాన్ సైన్యానికి అలాంటి ప్రశ్నలు అడగకూడదన్న విషయం తెలిసొచ్చింది. ఈ రెండు ఉదాహరణలూ మనకి చెప్పేదొకటే… భారత సైనికులు… సైనిక రహస్యాల విషయంలో ఏమాత్రం రాజీ పడట్లేదు. దేశభక్తిని వదులుకోవట్లేదు.
కల్నల్ సంతోష్ బాబు పార్థివదేహం… హైదరాబాద్‌లోని… హకీంపేట ఎయిర్‌పోర్ట్… ఎయిర్ ఫోర్స్ బేస్‌కి… మధ్యాహ్నం 12 గంటలకు వస్తుందని సూర్యాపేట కలెక్టర్ తెలిపారు. ఐతే… హైదరాబాద్ GOC అధికారులు మాత్రం… పార్థివ దేహం… సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ చేరుతుందని అంటున్నారు. ప్రత్యేక విమానంలో మృతదేహాన్ని తీసుకొస్తున్నారు. హకీంపేట ఎయిర్ పేస్ నుంచి సూర్యాపేటకు తీసుకెళ్తారు. లడక్ సమీపంలోని గల్వాన్ వ్యాలీలో భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో కల్నల్ సంతోష్ బాబు అమరుడయ్యాడు. సంతోష్ ఏడాదిన్నరగా దేశ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్నాడు. ఆయనకు భార్య సంతోషి, కుమార్తె అభిజ్ఞ(9), కుమారుడు అనిరుధ్(4) ఉన్నారు. ఆయన మృతితో సూర్యాపేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆ వీరసైనికుడికి అందరూ నివాళులు అర్పిస్తున్నారు.
కల్నల్ సంతోష్ బాబు 6వ తరగతి నుంచి కోరుకొండ సైనిక్ స్కూల్‌లో విద్యాభ్యాసం చేశాడు. ఆ తర్వాత నేషనల్ డిఫెన్స్ అకాడమీ, అనంతరం ఇండియన్ మిలటరీ అకాడమీలో చదువుకున్నాడు. చదువు పూర్తైన తర్వాత ఆర్మీలో చేరి దేశానికి సేవ చేస్తున్నాడు. మొత్తం 15 ఏళ్లుగా ఆయన విధుల్లో ఉన్నాడు. తన సర్వీస్‌లో ఎక్కువ కాలం కాశ్మీర్, లడక్, అరుణాచల్ ప్రదేశ్, పాకిస్థాన్ సరిహద్దులోనే విధులు నిర్వహించాడు. కొంతకాలం భారత ఆర్మీ తరపున కాంగో దేశంలోనూ పనిచేశాడు. 37 సంవత్సరాల చిన్న వయసులో కల్నల్‌గా పదోన్నతి పొందాడు. 2007లో పాకిస్తాన్ బోర్డర్‌లో ముగ్గురు చొరబాటు దారులను అంతమొందించాడు.