చైనాతో సరిహద్దు ఘర్షణలో అమరుడైన కల్నల్ సంతోష్ బాబు అడుగు జాడల్లోనే పిల్లలు అభిజ్ఞ, అనిరుధ్‌లను నడిపిస్తానని తెలిపారు ఆయన సతీమణి సంతోషి. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన పిల్లల్లో… తండ్రి చేసిన త్యాగం, చూపిన ధైర్యసాహసాల్ని పిల్లలకు నూరిపోస్తానని ఈనాడుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంతోషి తెలిపారు. తన భర్త ఎప్పుడూ దేశం గురించే ఆలోచించేవారనీ… దేశ రక్షణే ధ్యేయంగా ఉండేవారనీ… తమకు ఎంతో స్పూర్తి కలిగించేవారని ఆమె వివరించారు. చైనాతో ఘర్షణలో సంతోష్ బాబుతోపాటూ… అమరులైన 19 మంది సైనికులకూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్థిక సాయం ప్రకటించడం ఎంతో గొప్ప విషయం అన్నారామె.
తండ్రి కోరడంతో… ఆర్మీలో చేరిన సంతోష్ బాబు… ఓవైపు దేశానికి సేవ చేస్తూనే… మరోవైపు కుటుంబానికీ అండగా నిలిచారని సంతోష్ తెలిపారు. రేపు పిల్లలు పెద్దవాళ్లై… ఆర్మీలో చేరతానంటే… సంతోషంగా పంపిస్తానన్నారామె. యువత ఆర్మీలో చేరి దేశభక్తిని చాటుకోవాలని సంతోషి కోరారు. సంతోష్ బాబు, సంతోషి పెళ్లయి పదిన్నరేళ్లు అయింది. పెళ్లి తర్వాత రెండేళ్లు కలిసి ఉన్నారు. తర్వాత నాలుగేళ్లు సంతోష్ బాబు సర్వీస్‌లో ఉన్నారు. మళ్లీ మూడేళ్లు దంపతులు కలిసి ఉన్నారు. గత ఏడాది జూన్ నుంచి సంతోష్ ఫీల్డ్‌లో ఉన్నారు. దేశం తర్వాత ఎప్పుడూ భార్య, పిల్లలకే సంతోష్ ప్రధాన్యం ఇచ్చేవారని ఆమె తెలిపారు.
సంతోష్ బాబు పాపకు 9 ఏళ్లు, బాబుకు మూడేళ్లు. ఇప్పుడిప్పుడే ప్రపంచాన్ని చూస్తున్నారు. ఇంతలోనే తండ్రి దూరమైన పరిస్థితి. దేశ రక్షణలో ఎంత మంది ఉంటే అంత దేశానికి బలమన్న ఆమె… తండ్రినే రోల్ మోడల్‌గా చూపుతూ… పిల్లల్ని పెంచుతానన్నారు.