తమిళనాడులో పొత్తులు షురూ… బీజేపీ – కాంగ్రెస్‌‍లకు సీట్లు ఖరారు

0
35

సార్వత్రిక ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో తమిళనాడు రాష్ట్రంలో పొత్తు రాజకీయాలు ఊపందుకున్నాయి. ఈ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే సత్తా ఏ ఒక్క జాతీయ పార్టీకి లేకపోవడంతో ఆ పార్టీ స్థానికంగా బలమైన ప్రాంతీయ పార్టీలుగా ఉన్న అన్నాడీఎంకే, డీఎంకేతో పొత్తుపెట్టుకున్నాయి. ఫలితంగా ఈ రెండు పార్టీలకు నామమాత్రపు సీట్లను దక్కించుకున్నాయి.

మొన్నటికిమొన్న అధికార అన్నాడీఎంకేతో పొత్తుపెట్టుకున్న బీజేపీకి కేవలం 5 సీట్లు కేటాయించింది. అలాగే, ఇదే కూటమిలోని పీఎంకేకు 7 సీట్లు కేటాయించగా, హీరో విజయకాంత్ సారథ్యంలోని డీఎండీకేకు సీట్ల సర్దుబాటుపై చర్చ సాగుతోంది. కొన్ని పత్రికలు మాత్రం డీఎండీకేకు రెండు లోక్‌సభ సీట్లతో పాటు.. ఓ రాజ్యసభ సీటును ఇచ్చేందుకు అన్నాడీఎంకే సమ్మతించినట్టు సమాచారం.

మరోవైపు, బీజేపీ అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుంటే.. కాంగ్రెస్, డీఎంకేతో పొత్తు ఖరారు చేసుకుంది. ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో డీఎంకే ఎంపీ కనిమొళితో పాటు ఆ పార్టీ సీనియర్ నేతలు భేటీ అయ్యారు. మరోవైపు డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌తో తమిళనాడు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ముకుల్ వాస్నిక్ సమావేశమయ్యారు.

ఈ చర్చల అనంతరం స్టాలిన్, ముకుల్ వాస్నిక్ పొత్తు ప్రకటన చేశారు. తమిళనాడులో 39 లోక్‌సభ స్థానాలకుగాను 9 స్థానాలలోనూ, పుదుచ్చేరిలో 1 స్థానంలోను కాంగ్రెస్ (మొత్తం 10 సీట్లు) పోటీ చేయనుంది. 20కి పైగా స్థానాల్లో డీఎంకే పోటీ చేయనుంది. మిగిలిన సీట్లను కూటమి భాగస్వామ్య పక్షాలైన ఎండీఎంకే, సీపీఎం, వీసీకే, ఎంఎంకేలకు కేటాయించనున్నారు.