పుల్వామా ఉగ్రదాడి: పాకిస్థాన్‌పై నిషేధం ఎలా సాధ్యం ?

0
34

పుల్వామా ఉగ్రదాడి ఘటన అనంతరం భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. దీంతో పాకిస్థాన్‌‍పై భారత్ ప్రతీకార చర్యలకు దిగింది. ఇందులోభాగంగా, ఇప్పటికే ఆర్థికంగా దెబ్బతీసే చర్యలకు పూనుకుంది. అలాగే, పాక్ భూభాగంలోని తీవ్రవాద శిబిరాలపై ఏ క్షణమైనా దాడి చేసే అవకాశం ఉంది.

ఈ పరిస్థితుల్లో మే నెలలో జరుగనున్న ఐసీసీ ప్రపంచ క్రికెట్ కప్‌ టోర్నీ నుంచి పాకిస్థాన్‌ను బహిష్కరించాలన్న డిమాండ్లు బలంగా వస్తున్నాయి. కానీ, మాజీలు చాలామంది దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్న పాక్‌తో క్రికెట్‌ సంబంధాలు తెంచుకోవాలని ఐసీసీ, సభ్యదేశాలను బీసీసీఐ కోరినట్టు సమాచారం.

అయితే, విశ్వకప్‌లో పాక్‌పై నిషేధం విధించేలా ఐసీసీని భారత ప్రభుత్వం, బీసీసీఐ ఒప్పించడం అత్యంత క్లిష్టమైన విషయమని టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీ అభిప్రాయపడ్డాడు. ఈ విషయంలో ఐసీసీ నుంచి బీసీసీఐకి కనీస మద్దతు కూడా లభించకపోవచ్చని అన్నాడు. మే 30 నుంచి ఇంగ్లండ్‌లో వరల్డ్‌కప్‌ జరగనుంది. జూన్‌ 16న చిరకాల ప్రత్యర్థి పాక్‌తో భారత్‌ తలపడాల్సి ఉంది.

కానీ, ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ మ్యాచ్‌పై నీలి నీడలు కమ్ముకున్నాయి. కాగా పాక్‌తో అన్ని రకాల క్రీడా సంబంధాలు తెంచుకోవాలని గంగూలీ ఇంతకు ముందు వాదించాడు. పాక్‌ను బాయ్‌కాట్‌ చేయాలనే బీసీసీఐ డిమాండ్‌కు హర్భజన్‌, అజరుద్దీన్‌ తదితరులు మద్దతు తెలిపారు.