పుల్వామా ఘటన నేపథ్యంలో.. భారత్-పాకిస్తాన్‌ల మధ్య నెలకొన్న పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇంకా పాకిస్థాన్‌ను హెచ్చరించారు. తమ భూభాగంపై ఉన్న ఉగ్రవాద శిబిరాలను పాకిస్థాన్ వెంటనే నాశనం చేయాలని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.
ఏ ఒక్క ఉగ్రవాదికి మద్దతు పలికినా, అది దేశానికే చేటు తెస్తుందని ట్రంప్ ఉద్ఘాటించారు. ప్రస్తుతం వియత్నాం పర్యటనలో ఉన్న ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ… భారత్‌ను కవ్వించే చర్యలు వద్దని పాకిస్థాన్‌కు హితవు పలికారు.
ఉగ్రవాద శిక్షణా కేంద్రాలను ధ్వంసం చేయకుంటే పాకిస్థాన్ భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వుంటుందని హెచ్చరించారు. ఉగ్రవాదంపై తీరును మార్చుకోవాలని ఎంతో కాలంగా పాక్ ప్రభుత్వాలను తాము కోరుతూనే ఉన్నామని, ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్‌కు కూడా అదే మాట చెబుతున్నామని అన్నారు. యుద్ధమే జరిగితే అత్యధిక నష్టం పాకిస్థాన్ జరుగుతుందని వార్నింగ్ ఇచ్చారు.
ఇదిలా ఉంటే.. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలపై భారత్ వైమానిక దాడులు నిర్వహించిన తర్వాత సరిహద్దులో సైన్యం ఆంక్షలు విధించింది. ప్రతీకార దాడికి పాక్ సిద్ధమవుతోందన్న వార్తల నేపథ్యంలో అప్రమత్తమైన భారత్ సైన్యం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది.
సరిహద్దు సమీపంలోని గ్రామాలను ఖాళీ చేయించకపోయినప్పటికీ పౌరుల రాకపోకలపై నిషేధం విధించింది. సరిహద్దుకు ఐదు కిలోమీటర్ల పరిధిలోని ప్రజలు రాత్రిపూట సంచరించవద్దని హెచ్చరికలు జారీ చేసింది.
ఏప్రిల్ మొదటి వారం వరకు రాత్రి సాయంత్రం ఆరు గంటల నుంచి ఉదయం ఏడు గంటల వరకు రాకపోకలపై నిషేధం విధించినట్టు సైన్యం తెలిపింది. అలాగే, సరిహద్దులో రానున్న మూడు రోజులపాటు బీఎస్ఎఫ్ బలగాలు అత్యంత అప్రమత్తంగా ఉంటూ పెట్రోలింగ్‌ను ముమ్మరం చేయాలని కేంద్రం ఆదేశించింది.