జిత్తులమారి పాకిస్థాన్.. మళ్లీ యూటర్న్..

IAF Air Strikes News Live: There is only one pilot under our custody Says Pakistan

0
64

పాకిస్థాన్ మరోమారు యూటర్న్ తీసుకుంది. తమ వద్ద ఇద్దరు పైలెట్లు ఉన్నారంటూ మీడియాలో ఊకదంపుడు ప్రచారం చేసిన పాకిస్థాన్.. సాయంత్రానికి పల్టీ కొట్టింది. అబ్బే.. తమ వద్ద ఇద్దరు భారత పైలెట్లు లేరనీ కేవలం ఒక్కరు మాత్రమే ఉన్నారంటూ పేర్కొంది. ఈ మేరకు పాకిస్థాన్ ఆర్మీ ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ ట్విట్టర్‌లో స్పందించారు. ‘పాకిస్థాన్ ఆర్మీ అదుపులో ఒక్క పైలట్ మాత్రమే ఉన్నారు” అని పేర్కొన్నారు.

భారత వాయు సేనకు చెందిన ఒక మిగ్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను కోల్పోయామనీ, ఒక పైలట్ ఆచూకీ కనిపించడం లేదంటూ భారత విదేశాంగ శాఖ కార్యదర్శి ప్రకటన చేసిన కొద్దిసేపటికే పాకిస్థాన్ మాటమార్చడం గమనార్హం.

కాగా, ఇద్దరు ఐఏఎఫ్ పైలట్లను అరెస్ట్ చేశామంటూ ఇంతకు ముందు గఫూర్ బుధవారం ప్రకటించిన విషయం తెల్సిందే. అందులో ఒకరు గాయపడ్డారనీ, ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామని ఆయన అన్నారు. రెండో పైలట్‌కి గాయాలు కాలేదనీ.. ఆయన కస్టడీలో ఉన్నారని గఫూర్ చెప్పారు.

మరోవైపు భారత పైలట్ పాకిస్థాన్ కస్టడీలో ఉన్నారని ఇప్పటికే భారత్ గుర్తించింది. ఈ విషయమై పాకిస్థాన్‌ డిప్యూటీ హైకమిషనర్‌ నుంచి వివరణ సైతం కోరింది. కాగా మిగ్-21 విమానం పాకిస్థాన్ భూభాగంలో ల్యాండ్ అయ్యిందని న్యూఢిల్లీ వర్గాలు వెల్లడించాయి. పాకిస్థాన్ చెబుతున్నట్టు దాన్ని వాళ్లు కూల్చలేదని స్పష్టం చేశాయి.