గతంలో పాకిస్థాన్ సైన్యానికి భారత పైలట్ ఒకరు చిక్కారు. అతని పేరు నచికేత. కార్గిల్ యుద్ధ సమయంలో మిగ్-27 యుద్ధ విమానం నడుపుతూ లెఫ్టినెంట్ కె.నచికేత (26) ప్రమాదవశాత్తు పాక్ భూభాగంలో దూకాడు. ఆయనను పాక్ సైనికులు అదుపులోకి తీసుకున్నారు. ఇపుడు అచ్చం అలానే మిగ్-21 యుద్ధ విమాన కమాండర్ అభినందన్ వర్ధమాన్ చిక్కాడు.
భారత రక్షణ స్థావరాలపై బాంబులు వేసేందుకు వచ్చిన పాకిస్థాన్ యుద్ధ విమానాలపై దాడి చేసే క్రమంలో ఓ యుద్ధ విమానాన్ని కూల్చివేశాడు. ఆ తర్వాత అతని నడుపుతున్న యుద్ధ విమానం కూడా కూలిపోయింది. కానీ, అభినందన్ మాత్రం చాకచక్యంగా ప్రాణాలు కాపాడుకున్నాడు. దురదృష్టవశాత్తు అతను పాకిస్థాన్ భూభాగంలో పడిపోయి ఆ దేశ సైనికులకు చిక్కాడు.
అయితే, కార్గిల్ యుద్ధ సమయంలో పాక్ సైన్యానికి దొరికి సచికేతను సురక్షితంగా విడిపించే బాధ్యతను నాటి కేంద్ర ప్రభుత్వం ఇస్లామాబాద్‌లో అప్పటి భారత్ హైకమిషనర్ జి.పార్ధసారథికి అప్పగించింది. జెనీవా ఒప్పందం ప్రకారం పైలట్‌ను పాకిస్థాన్ భారత్‌కు ప్రాణాలతో అప్పగించింది. సచికేతను తీసుకుని భారత హైకమిషనర్ వాఘా సరిహద్దు మీదుగా స్వదేశానికి చేరుకున్నారు. ఇపుడు ఈ ఒప్పందం మేరకు అభినందన్ వర్ధమాన్‌ను వదిలిపెట్టాలని దేశ ప్రజలంతా ముక్తకంఠంతో కోరుతున్నారు.