భారత మిగ్ విమాన పైలట్ ఒకరు శత్రుదేశం పాకిస్థాన్ చేతికి చిక్కారు. ధైర్యసాహసాలకు, నిలువెత్తు పరాక్రమానికి పర్యాయపదంగా నిలిచే… అభినందన్ వర్థమాన్ ఇపుడు పాక్ చెరలో ఉన్నాడు. మిగ్-21 బైసన్ యుద్ధ విమానాన్ని నడుపుతూ ఊహించని విధంగా శత్రుదేశానికి పట్టుబడ్డాడు.

అభినందన్ తమ చేతికి చిక్కగానే పాకిస్థాన్ సైనికులు కిరాతకంగా ప్రవర్తించారు. చిత్రహింసలు పెట్టారు. ముఖంపై పిడిగుద్దులు కురిపించారు. కాళ్ళతో తన్నారు. ఈ దెబ్బలకు రక్తం కారుతున్న అభినందన్ మాత్రం ధైర్యాన్ని కోల్పోలేదు. భారత సైనిక రహస్యాలు చెప్పాలంటూ ప్రత్యక్ష నరకం చూపిస్తున్నా ఇసుమంత కూడా బెదరలేదు.

కళ్లకు గంతలు కట్టి, తాళ్లతో చేతుల్ని వెనక్కి విరిచికట్టి ముష్కరులు బూటు కాళ్లతో, పిడిగుద్దులతో దాడి చేస్తున్నా ఆ సైనిక ధీరుడు చలించలేదు. అభినందన్‌ను బంధించిన వీడియోను పాకిస్థాన్ మీడియాకు విడుదల చేసింది. ముఖమంతా రక్తధారలతో ఉన్న అభినందన్ పాకిస్థానీల ప్రశ్నకు ఏ మాత్రం తడుముకోకుండా జవాబివ్వడం వీడియోలో కనిపించింది.
పాక్ సైనికులు అడిగిన ప్రశ్నలకు అభినందన్ సమాధానమిస్తూ… “నా పేరు అభినందన్ వర్థమాన్. నేను ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారిని. నా సర్వీస్ నంబర్ 27981. నేను హిందువును” అని చెప్పారు. ఇంకా విషయాలు చెప్పాలని పాకిస్తానీలు డిమాండ్ చేయడంతో దయచేసి నాదొక విన్నపం.. నేను పాకిస్థాన్ ఆర్మీ ఆధీనంలోనే ఉన్నానా? అని ప్రశ్నించాడు. మీకు ఇంకేం చెప్పాలని గట్టిగానే బదులిచ్చారు. ఇప్పటివరకూ మీకు చెప్పింది చాలు.. క్షమించండి ఇక నేనేమీ చెప్పలేను అంటూ జవాబిచ్చారు.

పాకిస్థాన్ సైనికుల నిర్భందంలో ఉన్న మిగ్-21 యుద్ధ విమానం కమాండర్ అభినందన్ వర్థమాన్ స్వస్థలం తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా. ఆయన తండ్రి రిటైర్డ్ ఎయిర్ మార్షల్ సింహకుట్టి వర్ధమాన్. తన తండ్రి వైమానిక దళంలో పనిచేయడంతో చదువు పూర్తయిన తర్వాత ఆయన కూడా ఎయిర్‌ఫోర్స్‌లో చేరారు. అభినందన్ కుటుంబం ప్రస్తుతం చెన్నైలోని తాంబరం ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో నివసిస్తున్నది.
తాజా గా పాక్ సైన్యం ఆధీనంలో ఉన్న భారత వాయుసేన పైలట్ అభినందన్ ను విడుదల చేయబోతున్నట్టు పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అనౌన్స్ చేశారు. భారత్-పాకిస్థాన్ ల మధ్య శాంతి నెలకొనాలనే ఉన్నత లక్ష్యం తోనే పైలట్ అభినందన్ ను విడుదల చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
