పాకిస్థాన్ అధికారులు అప్పగించిన భారత వైమానిక వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌కు పలు కఠినతరమైన వైద్య పరీక్షలు చేయనున్నారు. ఇందుకోసం ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ నిఘా విభాగానికి ఆయన్ను తరలించారు.
ఇక్కడ అభినందన్‌కు శారీరక, మానసిక పరిస్థితిని అంచనా వేసేందుకు వివిధ వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అలాగే ఆయన శరీరంలో ఏదైనా బగ్‌లు అమర్చారా? అతినికి పాకిస్థాన్ సైన్యం మత్తు పదార్థాలు ఇచ్చిందీ లేనిదీ నిర్ధారించడానికి వివిధ రకాల స్కానింగ్‌లు నిర్వహిస్తారు.
శత్రువు చేతిలో చిక్కుకుని, తీవ్ర మానసిక క్షోభను అనుభవించినందున అతని మానసిక పరిస్థితిని అంచనావేసేందుకు కూడా పరీక్షలు నిర్వహిస్తారు. జాతీయ భద్రతకు సంబంధించిన రహస్యాలు రాబట్టేందుకు పాకిస్థాన్ సైన్యం అభినందన్‌ను చిత్రహింసలకు గురిచేసే అవకాశం ఉన్నందున శారీరక పరీక్షలను కూడా చేపడతారు.
అభినందన్‌ను ప్రశ్నించే నిమిత్తం ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబి), రిసెర్చ్ అనాలిసిస్ వింగ్(రా) ఎదుట కూడా హాజరుపరిచే అవకాశం ఉంది. అయితే అత్యంత క్లిష్టమైనదీ, తప్పనిసరిగా పాటించాల్సి నిబంధన ఏమిటంటే ఐఎఎఫ్ ఇంటెలిజెన్స్ ఎదుట హాజరై మొత్తం ఉదంతాన్ని వివరించడం.
అభినందన్ నుంచి రాబట్టిన సమాచారం ఆధారంగా అతను శత్రు దేశం చేతిలో బందీగా ఉన్న సమయంలో జాతీయ భద్రతకు సంబంధించిన రహస్యాలు వెల్లడించాడా? లేదా? అన్న విషయాన్ని ధ్రువీకరించుకోవడంతోపాటు అతను శత్రువుల పక్షంలో చేరిపోయాడా? అన్న విషయాన్ని కూడా నిఘా సంస్థలు నిర్ధారించుకోవలసి ఉంటుంది. అభినందన్ శారీరక, మానసిక పరిస్థితిలో ఏమాత్రం తేడా ఉన్నా ఆయన తన ప్రస్తుత బాధ్యతలను వదులుకుని క్లరికల్ బాధ్యతలకు పరిమితం కావలసి ఉంటుంది.