నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండు వన్డే మ్యాచ్‌లో భారత జట్టు 8 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు 48.2 ఓవర్లలో 250 పరుగులు మాత్రమే చేసింది. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన ఆసీస్ జట్టు 49.3 ఓవర్లలో 242 పరుగులకే చాపచుట్టేసింది.
ఈ మ్యాచ్‌లో భారత ఓపెనర్లు నిరాశపరిచినా, మిడిల్ ఆర్డర్ విఫలమైనా, తీవ్రమైన ఒత్తిడిలో కూడా కెప్టెన్ విరాట్ కోహ్లీ చక్కని ఇన్నింగ్స్ ఆడాడు. రోహిత్ డకౌట్ కాగా.. దూకుడుగా కనిపించిన ధావన్ (21; 29 బంతుల్లో 4×4) మాక్స్‌వెల్‌కు వికెట్ల ముందు దొరికిపోయాడు. 38కే ఓపెనర్లను కోల్పోయిన జట్టును కోహ్లి ఆదుకున్నాడు. స్ట్రైక్ రొటేట్ చేయడానికి ఇబ్బందిపడ్డ రాయుడు (18) లైయన్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు.
అనంతరం విజయ్ శంకర్ (46; 41 బంతుల్లో 5×4, 1×6) నుంచి కోహ్లీకి చక్కని సహకారం లభించింది. శంకర్ దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. కానీ మంచి ఊపు మీదున్న దశలో అతడు దురదృష్టవశాత్తు రనౌట్ కావడంతో 81 పరుగుల నాలుగో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. అప్పటికి స్కోరు 156. జంపా 33వ ఓవర్లో వరుస బంతుల్లో జాదవ్ (11), ధోని (0)లను ఔట్ చేయడంతో భారత్ 171/6కు చేరుకుంది. కానీ కోహ్లీ పోరాటాన్ని కొనసాగించాడు. జడేజా సహకారంతో కోహ్లీ స్కోరును 200కు దాటించాడు.
కౌల్టర్ నైల్ బౌలింగ్‌లో బౌండరీతో 40వ వన్డే శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ధాటిగా ఆడలేకపోయిన జడేజా (40 బంతుల్లో 21)ను కమిన్స్ ఔట్ చేశాడు. అతడే తన తర్వాతి ఓవర్లో కోహ్లీని కూడా వెనక్కి పంపాడు. భారత్ 12 పరుగుల వ్యవధిలో చివరి నాలుగు వికెట్లు చేజార్చుకుంది. ఫలితంగా 48.2 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా బౌలర్లలో పేసర్ కమిన్స్ (4/29), స్పిన్నర్లు లైయన్ (1/42), మాక్స్‌వెల్ (1/45) భారత్‌ను కట్టడి చేశారు.
ఆ తర్వాత అనంతరం బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 242 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. దీంతో ఐదు వన్డేల సీరిస్‌లో భారత్ 2-0తో ఆధిపత్యాన్ని సాధించింది. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్లలో స్థాయినిస్ 52 పరుగులు, హ్యాండ్‌స్కోంబ్ 48 పరుగులు, ఖవాజా 38 పరుగులు, ఫించ్ 37 పరుగులు చేసి ఔటయ్యారు. భారత బౌలర్లలో కుల్‌దీప్ యాదవ్ అత్యధికంగా 3 వికెట్లు పడగొట్టగా బుమ్రా, విజయ్ శంకర్‌లకు 2 వికెట్లు తీశారు. జడేజా, కేదార్ జాదవ్‌లకు చెరో వికెట్ దక్కింది.