చేతిలో స్మార్ట్ ఫోన్.. చెవిలో ఇయర్ ఫోన్స్ లేనిదే పొద్దు గడవదు చాలామందికి. పక్కనున్న మనుషుల కంటే ఫోన్లతో గడిపే వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది. తాజాగా చెవిలో ఇయర్ ఫోన్స్‌తో పట్టాలు దాటే ప్రయత్నం చేసి ప్రాణాలు కోల్పోయింది ఓ మహిళ. రైలు వస్తున్న శబ్దం వినిపించకపోవడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన ఖైరతాబాద్‌లో సంభవించింది.
వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన రేఖా మహల్ (25) లక్డీకాపూల్‌లోని టెలిఫోన్ భవన్ సమీపంలోని ఓ హాస్టల్‌లో ఉంటూ గ్లోబల్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. గురువారం ఉదయం జిమ్‌కు వెళ్లిన రేఖ తిరిగి లక్డీకాపూల్ వెళ్లేందుకు ఖైరతాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని గేట్ వద్దకు చేరుకుంది.
అప్పటికే గేటు వేసి ఉండడంతో గేటు దాటి లోపలికి వెళ్లింది. అదే సమయంలో నాంపల్లి వైపు రైలు వెళ్లగానే లైన్ క్లియర్ అయిందని భావించిన రేఖ వడివడిగా అడుగులు ముందుకు వేసింది. అయితే, అదే సమయంలో నాంపల్లి వైపు నుంచి లింగపల్లి వెళ్తున్న ఎంఎంటీఎస్ రైలును గమనించకపోవడంతో అది వేగంగా వచ్చి ఢీకొంది.
గమనించిన స్థానికులు వెంటనే ఆమెను గ్లోబల్ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు నిర్దారించారు. చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం వల్ల ఈ ఘోరం జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.