17వ లోక్‌సభ ఎన్నికల నగారా మోగింది. 543 లోక్‌సభ స్థానాలకు, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ఆదివారం సాయంత్రం నోటిఫికేషన్ జారీచేసింది. దేశవ్యాప్తంగా ఏడు విడుతల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి.
ఈ ఎన్నికల ప్రక్రియలో భాగంగా తొలి దశ పోలింగ్ ఏప్రిల్ 11న జరుగుతుంది. చివరిదైన ఏడో విడత పోలింగ్ మే 19న జరుగుతుంది. 23వ తేదీన ఓట్ల లెక్కింపు చేపడుతారు. ఈ ఓట్ల లెక్కింపుతో ఎన్నికల మహాక్రతువు పూర్తికానున్నది.
లోక్‌సభ ఎన్నికలతోపాటే ఆంధ్రప్రదేశ్, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి. తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలకు, ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ సీట్లకు తొలి విడుతలోనే (ఏప్రిల్ 11న) ఎన్నికలు నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ మే 23న జరుగనున్నది.
ఈ మేరకు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) సునీల్ అరోరా ప్రకటించారు. ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో ఎన్నికల కమిషనర్లు అశోక్ లావాసా, సుశీల్ చంద్రలతో కలిసి ఆదివారం ఈ వివరాల్ని వెల్లడించారు.
ప్రస్తుతం దేశంలో 90 కోట్ల మంది ఓటర్లు ఉండగా, 10 లక్షల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. 18-19 వయో గ్రూపునకు చెందిన వారు 1.5 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని వెల్లడించారు. 2014లో 84.3 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని ఆయన గుర్తుచేశారు.
తాజా ఎన్నికల కోసం దేశవ్యాప్తంగా 10 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు అరోరా చెప్పారు. 2014లో 9 లక్షల బూత్‌లు ఏర్పాటు చేయగా, ప్రస్తుతం అదనంగా మరో లక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
దేశంలోని ప్రతి ఎన్నికల కేంద్రంలో ఓటర్ వెరిఫేయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీప్యాట్)లను తప్పనిసరిగా వినియోగించనున్నట్లు సీఈసీ వెల్లడించారు. ఈవీఎంలపై అభ్యర్థి ఫోటో కూడా ఉంటుందని చెప్పారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ర్యాండమ్‌గా ఒక పోలింగ్ కేంద్రాన్ని ఎంచుకుని అక్కడి వీవీప్యాట్‌ల్లోని స్లిప్‌లను లెక్కించడాన్ని తప్పనిసరి చేసినట్లు చెప్పారు.