లోక్‌సభ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో కాంగ్రెస్‌కు డబుల్ షాక్ తగలనుంది. మాజీ హోంమంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డితో పాటు ఆమె కుమారుడు కార్తీక్ రెడ్డి పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. వారిద్దరూ అధికార తెరాసలో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అలాగే, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియానాయక్ కూడా పార్టీ మారే అవకాశం ఉంది.
ఇందులోభాగంగా, మజ్లిస్ అధినేత అసదుద్దీన్ నివాసంలో ఆదివారం టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌తో సబిత భేటీ కావడం… పార్టీ మార్పుపై కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి బలం చేకూరింది. ఇప్పటికే ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, రేగా కాంతారావు, చిరుమర్తి లింగయ్య అధికార తెరాసలో చేరనున్నట్టు ప్రకటించారు.
రాహుల్ పర్యటన మరుసటి రోజే మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఝలక్ ఇవ్వడం కాంగ్రెస్ శ్రేణులను విస్మయానికి గురిచేసింది. కేటీఆర్‌తో భేటీలో సబితతోపాటు ఆమె కుమారుడు కార్తీక్‌రెడ్డి, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ పాల్గొన్నారు. సుమారు గంటన్నరపాటు జరిగిన సమావేశంలో తెరాసలో చేరిన పక్షంలో ఇచ్చే ప్రాధాన్యంపై చర్చ జరిగినట్లు సమాచారం.