ఆస్తి పంచలేదని ఇంట్లోనే మారుతల్లి శవం… ఎక్కడ?

0
51
deadbody
deadbody

ఇటీవలి కాలంలో మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. ఆస్తులే ముఖ్యంగా కన్నబిడ్డలు ప్రవర్తిస్తున్నారు. ఫలితంగా కన్నతల్లిదండ్రులు తనువు చాలించినా అంత్యక్రియలు చేసేందుకు కన్నబిడ్డలు ముందుకురావడంలేదు.

తాజాగా ఆస్తి పంపకాలు చేపట్టలేదన్న కారణంతో మారుతల్లి చనిపోతే, ఆమె శవాన్ని ఇంటిలోనే రెండు రోజులపాటు ఉంచారు కొడుకులు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపాలిటీలోని మారుమూల గిరిజన గ్రామమైన పెద్ద బంగారు జాల గ్రామంలో వెలుగులోకి వచ్చింది.

ఈ వివరాలను పరిశీలిస్తే, పెద్ద బంగారుజాల గ్రామానికి చెందిన తాటి సమ్మయ్య మొదట బుచ్చెమ్మ అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వారికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. కొంతకాలానికి బుచ్చెమ్మ మృతిచెందింది. తర్వాత తాటి సమ్మయ్య.. రత్తమ్మ (75) అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వారికి పిల్లలు కలుగలేదు. అయితే రత్తమ్మ తర్వాత గ్రామంలో నివాసం ఉంటున్న భార్యాభర్తలు చనిపోవడంతో వారి కుమారుడు రవికుమార్‌ను తన వద్దకు తీసుకువచ్చి పెంచుకుంది.

ఈ క్రమంలో సమ్మయ్య బతికి ఉన్న కాలంలో తన ఎకరా భూమిని రత్తమ్మ పెంచుకుంటున్న రవికుమార్ రాసిచ్చాడు. కొన్నేళ్ల తర్వాత తాటి సమ్మయ్య మృతిచెందాడు. ఈనెల 9న రత్తమ్మ కూడా అనారోగ్యంతో మృతిచెందింది. దహన సంస్కారాలు చేయడానికి సమ్మయ్య మొదటి భార్య కుమారులను అడుగగా తమకు ఆమెకు ఎలాంటి సంబంధం లేదని తెగేసి చెప్పారు.

అంతేకాకుండా తన తండ్రి రవికుమార్‌కు రాసిన భూమి కూడా ఇవ్వమని భీష్మించుకుని కూర్చున్నారు. కుమారులు దహన సంస్కారాలు చేయాలని కుల పెద్దలు నిర్ణయించగా ముగ్గురు కుమారులు అందుకు తిరస్కరించారు. రెండు రోజులు దాటినా పట్టించుకోకపోవడంతో సోమవారం సమాచారం అందుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి గ్రామస్తుల సహకారంతో వారి కుమారులకు నచ్చ చెప్పి మృతురాలికి దహన సంస్కారాలు చేశారు.