రాష్ట్ర మంత్రి పరిటాల సునీత క్రియాశీలక రాజకీయాలకు దూరంగా కానునట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఆమె పోటీకి దూరంగా ఉండనుంది. తన స్థానం నుంచి తన కుమారుడు పరిటాల శ్రీరామ్‌ను బరిలోకి దించనుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు.
నిజానికి అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా మంత్రి పరిటాల సునీత పేరును అధిష్టానం ఖరారు చేసింది. అయితే.. ఆమె మాత్రం అభిమానుల కోరిక మేరకు పరిటాల శ్రీరామ్ పోటీ చేస్తాడని ప్రకటించారు. ఇదే జరిగితే ఆమె రాజకీయాలకు దూరమైనట్టే.
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, రెండు స్థానాల్లో అవకాశం కల్పించమని అడుగుతున్నామని.. కుదరని పక్షంలో శ్రీరామ్ తనకు బదులుగా రాప్తాడు నుంచి పోటీ చేస్తారని ఆమె స్పష్టం చేశారు. తన నిర్ణయాన్ని అధినేత దృష్టికి తీసుకెళతానని, ముఖ్యమంత్రి నిర్ణయం తమకు శిరోధార్యమని పరిటాల సునీత తెలిపారు.