తమిళ చిత్ర పరిశ్రమకు రమ్మన్నారు.. వచ్చేశా అంటున్నారు కథానాయిక రష్మిక. కార్తి కథానాయకుడిగా ‘రెమో’ ఫేం బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో రష్మిక కథానాయిక పాత్ర పోషిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ సినిమాను నిర్మిస్తోంది. ఇది రష్మిక తొలి తమిళ సినిమా కావడం విశేషం.
ఈ సందర్భంగా తీసిన ఫొటోలను రష్మిక ట్విటర్‌లో షేర్ చేశారు. ‘నన్ను నటిగా కన్నడ, తెలుగు ప్రేక్షకులు ఎంతో గొప్పగా ఆదరించారు. 2019లో కోలీవుడ్‌కు రమ్మని మీరూ అడిగారు (కోలీవుడ్ ఫ్యాన్స్), చివరికి వచ్చేశా. మీకు నా అమితమైన ప్రేమను పంపుతున్నా. కార్తి, తదితర బృందంతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది’ అని ఆమె పోస్ట్ చేశారు.
కాగా, రష్మిక ప్రస్తుతం విజయ్ దేవరకొండకు జోడీగా ‘డియర్ కామ్రేడ్’ చిత్రంలో నటిస్తున్నారు. మార్చి 17న ఈ సినిమా టీజర్ విడుదల కాబోతోంది. అదేవిధంగా వెంకీ కుడుముల దర్శకత్వం వహించబోతున్న సినిమాలోనూ కథానాయిక పాత్ర పోషించబోతున్నారు. ఇందులో నితిన్ కథానాయకుడు. ఈ చిత్రానికి ‘భీష్మ’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు తెలిసింది. మహేశ్‌బాబు-అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమాకు కూడా రష్మిక సంతకం చేసినట్లు సమాచారం.