టీఆర్ఎస్‌లోకి సబితమ్మ.. బీజేపీలోకి డీకే అరుణ?

0
30

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి మామూలుగా లేదు. సొంత పార్టీల నుంచి ఇతర పార్టీలకు జంప్ అవుతున్న నేతల సంఖ్య అమాంతం పెరిగిపోతుంది. ఇప్పటికే తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు కీలక కాంగ్రెస్ నేతలు రెడీ అయ్యారు. ఈ క్రమంలో ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతో మహేశ్వరం కాంగ్రెస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఆమె కుమారుడు కార్తీక్ రెడ్డి ఇటీవల సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌లో చేరే విషయంపై సీఎం కేసీఆర్‌తో చర్చించారని తెలుస్తోంది. దీంతో సబిత త్వరలోనే కారెక్కనున్నారని టాక్ వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మరో కీలక నేత తెలంగాణ కాంగ్రెస్‌కు బైబై చెప్పనున్నారని తెలుస్తోంది.

ఇప్పటికే టీ-కాంగ్రెస్‌కు చెందిన పలువురు నేతలు ఆ పార్టీని వీడారు. మహబూబ్ నగర్‌కు చెందిన సీనియర్ నేత డీకే అరుణ కూడా ఇదే బాట పట్టనున్నట్టు తెలుస్తోంది. అయితే బీజేపీలో చేరేందుకు ఆమె రంగం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం.

రెండు రోజుల కిందట ఆమె ఢిల్లీ వెళ్లారని, బీజేపీ అగ్రనేతలతో సంప్రదింపులు జరిపారని సమాచారం. డీకే అరుణ నివాసంలో బీజేపీ సీనియర్ నేత రామ్ మాధవ్ చర్చలు జరిపినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. బీజేపీ తరపున మహబూబ్ నగర్ లోక్ సభ స్థానానికి డీకే అరుణ పోటీ చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.