అక్కడకు వెళ్తే ఆంధ్రావాళ్లను కొడుతున్నారు : పవన్ కళ్యాణ్

0
48

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన ఎన్నికల ప్రచారంలో మాటల తూటాలు పేల్చుతున్నారు. ముఖ్యంగా, టీసీఎం కేసీఆర్‌న లక్ష్యంగా చేసుకుని మాటల దాడి చేస్తున్నారు. భీమవరం సభలో వైసీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్‌ను ఉద్దేశించి ప్రస్తావిస్తూ కేసీఆర్‌, జగన్‌మోహన్‌రెడ్డి తీరును పవన్‌ ఎండగట్టారు.

హైదరాబాద్‌లో కేసీఆర్‌ మనవాళ్ల భూములు తీసేసుకుంటారా? తెలంగాణా ఏమన్నా పాకిస్థాన్‌ అనుకుంటున్నారా? పౌరుషం లేదా? మనమింకా బతికున్నాం. ఇంకా విభజించే రాజకీయాలు చేయొద్దు. కేసీఆర్‌ ఇక్కడ అడ్డదారి రాజకీయాలు చేస్తే పోనీలే పోనీలే అని వదిలే పరిస్థితి లేదు. భయపడుతూ భయపడుతూ ఎంతకాలం ఉంటాం? ధైర్యంగా ఉందాం అని పిలుపునిచ్చారు.

‘ఆంధ్రులు ద్రోహులు, దోపిడీదార్లు, పనికిమాలినవాళ్లు, దగాకోర్లు అంటూ తెలంగాణ నాయకులు తిడుతుంటే.. అలాంటి నాయకుల్ని మీ నాయకుడు జగన్‌ భుజానికెత్తుకెళ్తుంటే మీకెలా మనసొప్పుతోంది? అని వైసీపీ నాయకులను అడగండి’ అని పిలుపునిచ్చారు. ‘అంత హీనంగా తిడుతుంటే.. మీరు ఆంధ్రుల పుట్టుకే పుట్టి ఉంటుంటే మీకు పౌరుషమే రాలేదా?’ అంటూ వైసీపీ అభ్యర్థులను తీవ్రంగా విమర్శించారు.

ఏపీలో ప్రజలు కులమతాలుగా విడిపోయి కొట్టుకుంటుంటే.. తెలంగాణలో మాత్రం ఏపీ ప్రజల్ని ఆంధ్రులంటూ కొడుతున్నారని పవన్‌ అన్నారు. ‘‘విభిన్న సామాజికవర్గాలు.. మతాలపేరుతో మనలోమనం ఇక్కడ కొట్టుకుంటున్నాం. కానీ, తెలంగాణకెళ్తే.. మనందరినీ కలిపి ఆంధ్రావాళ్ల కింద కొడుతున్నారు. దళితులు, క్షత్రియులు, బ్రాహ్మణులు, వైశ్యులు ఎవరైనా కానివ్వండి.. వారికి మాత్రం మనం ఆంధ్రులం. విసిగిపోయాను నేను. కులాలు పెళ్లిళ్లు చేసుకోవడానికే. స్నేహాలు చేయడానికి కులమంటే కుదరదు.

అలాంటిది రాజకీయాల్లోకి కులం వచ్చిందంటే మనం అధఃపాతాళానికి వెళ్లిపోతున్నామని అర్థం. భావజాలంతో రాజకీయం ముడిపడాలిగానీ.. కులంతో ముడిపడి రాజకీయమంటే అది మనం భయపడాల్సిన విషయం. అందుకే నేనెప్పుడూ నాకు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు అని ఎందుకంటానంటే.. నాకు మానవత్వమే ఉంది. ప్రతి కులానికీ నేను గౌరవం ఇస్తాను. అభివృద్ధిలో అందరికీ సమానమైన ప్రాతినిధ్యం కల్పిస్తాను’’ అని పవన్‌ స్పష్టం చేశారు.