వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి సోదరిపై గత కొంతకాలంగా సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల బాహుబలి స్టార్ ప్రభాస్‌తో లింకు పెట్టి వార్తలొచ్చాయి. ఈ వార్తలను షర్మిల మీడియా ముందుకు వచ్చి ఖండించారు. తాజాగా సోషల్ మీడియాతో షర్మిలకు ఇబ్బందులు తప్పలేదు.
షర్మిలపై యూట్యూబ్‌లో అసభ్యకర పోస్టులు చేసిన వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం అమరావతిలో షర్మిల మాట్లాడుతుండగా ఓ టీవీ చానల్ ప్రత్యక్ష ప్రసారం చేసింది. దీనిని చూస్తున్న చౌటుప్పల్ రాంనగర్ ప్రాంతానికి చెందిన దివి హరిబాబు (39) మూడుసార్లు వరుసగా యూట్యూబ్‌లో అసభ్యకర పోస్టులు చేశాడు.
అతడి పోస్టులు చూసిన మానవ హక్కుల మండలి వైస్ చైర్మన్ బి.అనిల్ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. ఐపీ అడ్రస్ ద్వారా నిందితుడు హరిబాబును గుర్తించిన పోలీసులు చౌటుప్పల్‌లో అతడిని అదుపులోకి తీసుకున్నారు.