కుటుంబం కంటే యుద్ధ విమానాలే ఇష్టం : అభినందన్

0
47
Abhinandan
Abhinandan

తనకు కుటుంబం కంటే యుద్ధ విమానాలే అమితమైన ఇష్టమని భారత వైమానిక దళానికి చెందిన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ చెప్పుకొచ్చారు. పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాన్ని నేలకూల్చి ఆపై తాను బందీగా దొరికిపోయినా, అమోఘమైన ధైర్యసాహసాలు ప్రదర్శించిన భారత వాయుసేన పైలట్ అభినందన్ ఇప్పుడో జాతీయ హీరోగా మారిపోయిన విషయం తెల్సిందే.

పాకిస్థాన్ కస్టడీ నుంచి విడుదలైన తర్వాత అభినందన్‌కు ఢిల్లీలోని త్రివిధ దళాల ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స అందించారు. అయితే, గాయాల తీవ్రత దృష్ట్యా వైద్యుల సలహా మేరకు అభినందన్‌కు ఎయిర్ ఫోర్స్ అధికారులు నాలుగు వారాల విశ్రాంతినిచ్చారు. దీంతో స్వగ్రామానికి వెళ్లి విశ్రాంతి తీసుకోవాలని అధికారులు సూచించారు. కానీ, అభినందన్ మాత్రం నిరాకరించారు.

తమిళనాడులోని సొంతూరికి కాకుండా శ్రీనగర్‌లో ఉన్న ఎయిర్‌బేస్‌కు వెళ్లి అక్కడ యుద్ధ విమానాల చెంత విశ్రాంతి తీసుకున్నాడు. తనకెంతో ఇష్టమైన యుద్ధ విమానాలు, సహచరులతో గడపడమే తనకు ఇష్టం అని చాటుతూ అభినందన్ శ్రీనగర్‌లోనే విశ్రాంతి కాలాన్ని పూర్తిచేసుకున్నట్టు తెలుస్తోంది.

మరికొన్ని రోజుల్లో తదుపరి వైద్య పరీక్షల కోసం ఢిల్లీ రానున్నాడు. ఈసారి అభినందన్‌కు ఫిట్‌నెస్ టెస్టులు నిర్వహించే అవకాశం ఉంది. ఈ పరీక్షల్లో వచ్చే ఫలితాల ఆధారంగా అభినందన్ తిరిగి యుద్ధ విమానం నడిపే అవకాశాలు ఆధారపడి ఉన్నాయి.