
పాలకొల్లు జనసేన పార్టీ నేత, మాజీ మంత్రి హరిరామజోగయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. నాడు వంగవీటి రంగా హత్య వెనుక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, నరసాపురం వైసీపీ ఏంపీగా పోటీ చేస్తున్న రఘురామ కృష్ణంరాజు తాత సిరీస్ సుబ్బరాజుల పాత్ర వుందని ఆరోపించారు. ఇలాంటి క్రిమినల్ చరిత్ర ఉన్న కుటుంబం నుంచి వచ్చిన రఘురామ కృష్ణంరాజు గురించి ప్రజలు ఆలోచించాలని అన్నారు.
ఈ సందర్భంగా హరిరామజోగయ్య మాట్లాడుతూ, ఇది ఎన్నికల సమయం కనుక, అవసరమైన విషయాలను ప్రస్తావించాల్సిన బాధ్యత ఉందని అన్నారు. ఈ విషయాన్ని తానేమీ కొత్తగా ప్రస్తావించడం లేదని, 2015 లో ‘నా రాజకీయ ప్రస్థానం’ అనే పుస్తకం రాశానని గుర్తు చేశారు.
వంగవీటి రంగా హత్యకు చంద్రబాబు ఎంత కారణమో, సిరీస్ సుబ్బరాజు కూడా అంతే కారణమని ఆరోపించారు. అలాంటి కుటుంబం నుంచి ఎంపీగా పోటీ చేయడం సబబు కాదని, ఇలాంటి వ్యక్తిని పార్లమెంట్‌కు పంపించడం అవసరమా? అని ప్రజలు ఆలోచించుకోవాలని సూచించారు.