ఏపీకి ఎంతో చేయాలని అనుకున్నా.. ప్చ్… చంద్రబాబు కలసిరాలేదు : నరేంద్ర మోడీ

0
40

రాష్ట్ర విభజన వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో చేయాలని పరితపించానని కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసిరాలేదని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. ఆయన తన ఎన్నికల ప్రచారంలో భాగంగా, శుక్రవారం కర్నూలులో జరిగిన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌లపై పరోక్ష వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ఆంగ్లభాషలో ‘ఎస్ యు ఎన్ సన్’ అంటే సూర్యుడు అని, ‘ఎస్ ఒ ఎన్ సన్’ అంటే కుమారుడు అని అర్థం అని చెప్పారు.

మీరు బీజేపీకి వేసే ఓటుతో ఏప్రిల్ 11 తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సరికొత్త సూర్యోదయాన్ని చూస్తుందని, అదే సమయంలో ఎవరైతే తన పుత్రుడి రాజకీయ ఎదుగుదలను చూడాలనుకుంటున్నారో వారి ఆశలకు, ఆకాంక్షలకు అస్తమయం అవుతుందని అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్‌లో సూర్యోదయం కావాలనుకుంటే బీజేపీకి ఓటేయాలని పిలుపునిచ్చారు. సూర్యోదయం కావాలి అనుకుంటే పుత్రుడి యొక్క రాజకీయ భవిష్యత్తును కోరుకుంటున్న ఆ తండ్రి ఆశలు నెరవేరకూడదని స్పష్టంచేశారు.

ఇకపోతే, తాను రాష్ట్రానికి ఎంతో చేయాలనుకుంటున్నానని, కానీ, రాష్ట్ర ప్రభుత్వం కలిసిరావడంలేదని మోడీ విమర్శించారు. కర్నూలులో ఐఐఐటీ, మెగా పవర్ పార్క్ ఇచ్చింది తానేనని, విశాఖలో రైల్వే జోన్ ఇచ్చింది తానే అని గుర్తుచేశారు. కర్నూలు వచ్చిన తొలి ప్రధానమంత్రిని కూడా తానే అని, ఏపీకి తొలి గిరిజన విశ్వవిద్యాలయం మంజూరు చేసిందీ తానేననీ మోడీ వెల్లడించారు. ఐఐఎం, ఐఐటీ, రాజమండ్రి, కడప విమానాశ్రయాల విస్తరణ, ఇలా ఎన్నో చేసినా రాష్ట్ర ప్రభుత్వం తమతో కలిసి పనిచేయడంలేదని విమర్శించారు. ప్రధాని అయ్యాక తొలి మంత్రివర్గ సమావేశంలోనే పోలవరానికి అనుమతులు మంజూరు చేశానని గుర్తుచేశారు.

ఎక్కడైనా పథకాల అమలులో కుంభకోణాలు జరగడం సాధారణ విషయం, కానీ ఇక్కడ కుంభకోణాలు చేయడం కోసమే పథకాలు పుట్టిస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. ఏ పథకాలైతే రాష్ట్ర అభివృద్ది కోసం రూపొందించారో వాటన్నింటిలో అవినీతి రాజ్యమేలుతోందన్నారు. రాజధాని అమరావతి నిర్మాణం నుంచి ప్రతి పథకం కూడా అవినీతిమయమైందన్నారు. రాష్ట్రానికి తాము కేటాయించిన నిధులకు లెక్కచెప్పమని అడిగినప్పటి నుంచి చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని మండిపడ్డారు. ఇచ్చిన డబ్బుకు లెక్క చెప్పమంటే చంద్రబాబు యూటర్న్ బాబుగా మారిపోయాడని విమర్శించారు.

“దేశం మొత్తమ్మీద పొద్దున, సాయంత్రం కోర్టుల చుట్టూ తిరిగేవాళ్లతో జత కలిసి నన్ను ఓడించడానికి యూటర్న్ బాబు ప్రయత్నిస్తున్నారు. ఈ దేశం, ఈ రాష్ట్రం కోసం కాకుండా, వాళ్లు మాట్లాడే మాటలతో ఎక్కడో ఉన్న పాకిస్థాన్‌లో హీరోలు కావాలని కోరుకుంటున్నారు. తన రాజకీయ స్వార్థం కోసం, తన అసమర్థత కప్పిపుచ్చుకోవడానికి యూటర్న్ తీసుకున్న చంద్రబాబు అబద్ధాల కోటలు కడుతూ, అబద్ధాలతోనే బతుకుతున్నారు. కేంద్రం నుంచి వస్తున్న పథకాలకు వారి స్టిక్కర్లు తగిలించి ప్రజలకు అందిస్తున్నారు. తమవిగా చెప్పుకుంటున్నారు. అందుకే ఆయన స్టిక్కర్ బాబు అయ్యాడు, యూటర్న్ బాబు అయ్యాడు” అంటూ మండిపడ్డారు.