మోడీ – కేసీఆర్.. ఇద్దరూ తోడు దొంగలే : రాహుల్ గాంధీ

0
41

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోమారు తెలంగాణ రాష్ట్రంలో సోమవారం ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన తెరాస అధినేత కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోడీలపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్రంలో కుటుంబపాలన నడుస్తోందని ఆరోపించారు.

నల్గొండ జిల్లాలోని హుజూర్ నగర్‌లో నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, టీఆర్ఎస్‌కు ఓటేస్తే బీజేపీకి వేసినట్టేనని, మోడీ, కేసీఆర్ ఇద్దరూ తోడుదొంగలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దళితులు, ఆదివాసీలు, మైనార్టీలను నరేంద్ర మోడీ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.

దేశంలో విద్వేషాలు రెచ్చగొడుతున్న మోడీని ఓడించి తీరుతామని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీని గెలిపించి అధికారంలోకి తీసుకువస్తే పేదరిక నిర్మూలనకు పాటుపడతామని, వరి పండించే రైతులకు కనీస మద్దతు ధర కల్పిస్తామని, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని, వ్యవసాయ క్షేత్రాలకు సమీపంలోనే గోదాములు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తామని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ ప్రాంతంలో ఉన్న నీటిలో ఫ్లోరైడ్ అధికంగా ఉందని, దీంతో, ఇక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్న విషయం తనకు తెలుసని అన్నారు. ఈనాటికీ ఈ ప్రాంతంలో ఫ్లోరైడ్ సమస్య అలానే ఉందని, నల్గొండ వాసులకు శుద్ధమైన మంచినీటిని ఇస్తామని చెప్పిన కేసీఆర్ హామీ ఏమైందని ప్రశ్నించారు. తాము అధికారంలోకి రాగానే ఫ్లోరైడ్ బాధితుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఢిల్లీ పీఠంపై కాంగ్రెస్ ఉంటే పేదలకు ‘న్యాయ్’ పథకం అమలు చేసి తీరతామని మరోసారి స్పష్టం చేశారు.