సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మం లోక్‌సభ ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. ఈ స్థానం నుంచి చివరిక్షణంలో తెరాస అభ్యర్థిగా నామా నాగేశ్వర రావు బరిలోకి దిగడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. పైగా, దేశ రాజకీయాల్లో ఖమ్మం పార్లమెంట్ స్థానానికి ప్రత్యేక స్థానం ఉంది. సీఎంలుగా చేసిన ఇద్దరు నేతలు పార్లమెంట్‍లో ప్రజల వాణిని వినిపించారు. మరో ముగ్గురు ఎంపీలు మంత్రులుగా సేవలందించారు.
ఎప్పటికప్పుడు విభిన్నమైన తీర్పునిస్తున్న అక్కడి ప్రజలు… కొత్త వారికి కూడా జై కొట్టారు. 1957లో ఆవిర్భవించిన ఖమ్మం లోక్‌సభ స్థానానికి ఇప్పటివరకు 14 సార్లు ఎన్నికలు జరిగాయి. అప్పటి నుంచి ప్రతీ ఎన్నికలోనూ ఏదో ఒక విశేషం ఈ స్థానంలో కనిపిస్తూ ఉంది.
ఖమ్మం లోక్‌సభ ఏర్పడిన తొలి ఎన్నికల్లో కమ్యూనిస్టు నేత, పీడీఎఫ్ అభ్యర్థిగా పోటీ చేసిన విఠల్‌రావు విజయం సాధించారు. ఒకే పార్టీ నుంచి మూడుసార్లు ఎన్నికైన ఘనత కాంగ్రెస్ నేత తేళ్ల లక్ష్మీకాంతమ్మ సొంతం చేసుకున్నారు. వరుసగా రెండుసార్లు గెలుపొందిన నేతగా.. మాజీ సీఎం జలగం వెంగలరావు., ఆయన సోదరుడు జలగం కొండలరావులు దక్కించుకున్నారు.
ఇకపోతే, కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ మహిళా నేతల్లో ఒకరైనా రేణుకా చౌదరి ఇక్కడ నుంచి గెలుపొంది కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఈమె ఖమ్మం నుంచి వరుసగా రెండుసార్లు విజయం సాధించారు.
ఆ తర్వాత జలగం వెంగలరావు, నాదెండ్ల భాస్కరరావులు సుదీర్ఘ కాలం రాజకీయాలకు దూరంగా ఉన్నా.. ఖమ్మం నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహించారు. ఇద్దరూ ముఖ్యమంత్రులుగా చేశారు. జలగం వెంగళరావు.. 1973 నుంచి 1978 వరకు ఏపీకి సీఎంగా చేశారు. 1984లో ఇందిరా గాంధీ మరణం తర్వాత జరిగిన ఉపఎన్నికల్లో ఖమ్మం నుంచి పోటీ చేశారు. రాజీవ్‌గాంధీ కేబినెట్‌లో పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు. 1989లో రెండోసారి ఎంపీగా ఖమ్మం నుంచి విజయం సాధించారు.
ఆయన తర్వాత.. ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా చేసిన నాదెండ్ల భాస్కర్‌రావు… 1998లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ఖమ్మం నుంచి గెలుపొందారు. ఏడాది మాత్రమే ఎంపీగా కొనసాగారు.
అదేవిధంగా 1991లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో.. ఐపీఎస్ అధికారి పీవీ రంగయ్యనాయుడుని కాంగ్రెస్ ఖమ్మం అభ్యర్థిగా బరిలోకి దింపింది. ఘనవిజయం సాధించిన ఆయన.. పీవీ నరసింహారావు ప్రభుత్వంలో కేంద్ర టెలికాం శాఖామంత్రిగా, జలవనరుల మంత్రిగా చేశారు. 1996లో రెండోసారి పోటీ చేసినా… సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చేతిలో ఓటమిపాలయ్యారు.
1999, 2004లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన రేణుకా చౌదరి విజయం సాధించారు. మన్మోహన్ సింగ్ కేబినెట్‌లో రెండుసార్లు స్త్రీ, శిశు సంక్షేమ మంత్రిగా పని చేశారు. యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీకి నమ్మినబంటుగా ఉన్నారు.
ఇక 2009 విషయానికి వస్తే… టీడీపీ నుంచి బరిలోకి దిగిన నామా నాగేశ్వరరావు విజయం సాధించారు. ఆ తర్వాత.. 2014లో వైసీపీ నుంచి పోటీ చేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి నామాపై విజయం సాధించారు. ఎక్కువసార్లు ఎంపీ స్థానాన్ని గెల్చుకున్న ఘనత కాంగ్రెస్‌కే దక్కింది. ఇపుడు పోటీ కేవలం రేణుకా – నామా నాగేశ్వర రావుల మధ్యే రసవత్తరంగా సాగుతోంది. మొత్తంగా.. ఖమ్మం నియోజకవర్గం నుంచి ఇద్దరు సీఎంలు ఎంపీలుగా పోటీ చేసి విజయం సాధించడంతో.. ఖమ్మం రాజకీయ గుమ్మంగా మారిపోయింది.