కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేరళ రాష్ట్రంలోని వాయనాడ్ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. దీనిపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, సీపీఎం సీనియర్ నేత అచ్యుతానందన్ స్పందిస్తూ, రాహుల్ గాంధీ పరిపక్వత లేని, అనుభవశూన్యుడని చెబుతూ ‘అమూల్ బేబీ’గా అభివర్ణించారు.
“అప్పట్లో ఓ సారి నేను రాహుల్ గాంధీని ‘అమూల్ బేబీ’ అని వెక్కిరించాను. అప్పుడు అది నిజం. అలా ఎందుకు పిలిచానంటే అతను భారత రాజకీయాలను అర్థం చేసుకోకుండా మార్పులు చేయబోయాడు. చిన్నపిల్లాడిలా భావోద్వేగాలతో నిర్ణయాలు తీసుకున్నాడు. రాహుల్ గాంధీ ఇప్పుడు నడివయస్సుకొచ్చాడు. ఈ రోజుకి కూడా అతనిలో ఎలాంటి మార్పు వచ్చినట్టు లేదు’ అని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.
ప్రస్తుతం పరిపాలనా సంస్కరణల సంఘానికి ఛైర్మన్‌గా ఉన్న అచ్యుతానందన్ కాంగ్రెస్ చీఫ్‌పై మండిపడ్డారు. ఏకే ఆంటోనీ, రమేష్ చెన్నితాల వంటి నేతల సలహాతో వాయనాడ్‌లో ఎల్డీఎఫ్‌తో తలపడి పొరపాటు చేస్తున్నారని విమర్శించారు. ‘ఇతరులు సలహా చెబితే మట్టిలో పొర్లాడే పిల్లాడి మాదిరిగా ప్రవర్తిస్తున్నారు. తన అవగాహనతో నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. తను కూర్చున్న కొమ్మని నరుక్కొనే పిల్లాడికి ఉన్నంత జ్ఞానం అతనిలో ఉంది. అందుకే అప్పట్లో నేను అతనిని అమూల్ బేబీ అన్నాను. అది ఇప్పటికీ వర్తిస్తుందని’ సీపీఎం కురువృద్ధుడు వ్యాఖ్యానించారు.