నవ్యాంధ్రలో విజయం మాదే : చంద్రబాబు

0
77

నవ్యాంధ్రలో మళ్లీ తమ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు జోస్యం చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నూటికి వెయ్యి శాతం విజయం సాధిస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియ అమలులోకి రాగానే ఎస్పీలను, ఇతర అధికారులను ఈసీ బదిలీ చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా చీఫ్‌ సెక్రటరీని బదిలీ చేయడం, కొత్త సీఎస్‌ను నేరుగా నియమించడం అవాంఛనీయమన్నారు.

తెలంగాణ ఎన్నికల్లో టెక్నాలజీని దుర్వినియోగం చేశారు. 25 లక్షల మంది ఓటర్ల పేర్లను అక్రమంగా తొలగించారు. పోలైన ఓట్లకు, మొత్తం ఓటర్ల సంఖ్యకు చాలా తేడా ఉంది. ఇందుకు ఆ తర్వాత ఎన్నికల కమిషన్‌ అధికారులు క్షమాపణ చెప్పారు. మా రాష్ట్రంలో కూడా ఫామ్‌-7 ద్వారా 7 లక్షల ఓటర్ల పేర్లను తొలగించే కుట్ర జరిగింది. మేం సకాలంలో చర్యలు తీసుకోవడంతో పరిస్థితి చేయదాటిపోలేదన్నారు.

ఈవీఎంలకు అనుసంధానించే వీవీప్యాట్‌ స్లిప్పులను ప్రతి నియోజకవర్గంలో 50 శాతం చొప్పున లెక్కించాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. ఇందుకోసం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ వేస్తామని ప్రకటించారు. ఈ డిమాండ్‌తో బీజేపీ మినహా 15 ప్రాంతీయ పార్టీలు, 6 జాతీయ పార్టీలు ఏకీభవిస్తున్నాయని తెలిపారు.

ఎన్నికల ప్రక్రియపై ఓటర్లలో విశ్వాసం, విశ్వసనీయత తీసుకురావడమే తన లక్ష్యమని, ఇందుకోసం దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్టినట్లు చెప్పారు. ఆదివారమిక్కడి కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో ఎన్డీయేతర ప్రతిపక్షాలతో ఆయన సమావేశమయ్యారు.