చెన్నైకి చంద్రబాబు వచ్చారో లేదో.. కనిమొళి నివాసంలో ఐటీ సోదాలు?

0
46

తమిళనాడు రాజధాని చెన్నైకి ఏపీ సీఎం చంద్రబాబు వచ్చారో లేదో డీఎంకే నేత కనిమొళి నివాసంలో ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. తమిళనాడులోని తూత్తుకుడిలో ఉన్న ఆమె నివాసం, పార్టీ కార్యాలయంలో పది మంది ఐటీ అధికారులు ఈ సోదాలు జరుపుతున్నట్టు సమాచారం.

ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఆమె భారీగా నగదు వినియోగిస్తున్నారన్న ఆరోపణల మేరకు ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కాగా, ఈ విషయం తెలుసుకున్న డీఎంకే శ్రేణులు ఆమె నివాసం వద్దకు చేరుకున్నాయి. లోపలికి వెళ్లేందుకు యత్నించిన డీఎంకే కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు.

ఇదిలా ఉంటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు డీఎంకే అధినేత స్టాలిన్ ధన్యవాదాలు తెలిపారు. మంగళవారం చెన్నై వెళ్లిన చంద్రబాబు… డీఎంకే ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీకి మద్దతుగా ప్రసంగించారు.

ఈ సందర్భంగా స్టాలిన్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, ”చెన్నైకి వచ్చి డీఎంకేకు మద్దతు ప్రకటించిన శ్రీ చంద్రబాబుకు హృదయపూర్వక ధన్యవాదాలు. నియంతృత్వ మోదీ ప్రభుత్వాన్ని, అవినీతిలో కూరుకుపోయిన తమిళనాడులోని అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తాం. దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు చేస్తున్న పోరాటంలో డీఎంకే ముందు వరుసలో ఉంటుందని మాట ఇస్తున్నా” అని తెలిపారు.