విలక్షణ నటుడిగా కోట్లాది మంది ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించుకున్న ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ బెంగళూరు సెంట్రల్ లోక్ సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులకు ధీటుగా ఆయన ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.
చాలా కాలంగా భాజపా తీరుపై ఆయన తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. మధ్య బెంగళూరులో భాజపా నుంచి సిట్టింగ్ ఎంపీ పి.సి.మోహన్ పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ నుంచి రిజ్వాన్ అర్షద్ బరిలోకి దిగారు. గట్టిగా పోటీ ఉన్న ఈ ప్రాంతంలో ప్రకాశ్‌రాజ్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. కొంత కాలంగా ప్రచారంలో నిమగ్నమైపోయారు. ప్రచారం కోసం సామాజిక మాధ్యమాలను కూడా బాగా వినియోగించుకుంటున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కుల, మతాలకు అతీతంగా, ప్రలోభాలకు గురి కాకుండా ఓటు వేయాలని విన్నవించారు. తన పోరాటం ఏ ఒక్క వ్యక్తిపై కాదని చెప్పారు. ప్రజల కోసమే తాను పోరాడుతున్నానని వెల్లడించారు. ప్రజాస్వామ్య దేశంలో సరైన నాయకుడిని ఎన్నుకున్నప్పుడే ప్రజలు గెలిచినట్టవుతుందని చెప్పారు. సరైన వ్యక్తిని ఎన్నుకోకపోతే… ఆ ఓటమి ప్రజలదేనని చెప్పారు.
ఒక పార్టీ ఏడాదికి రూ.72,000 అందిస్తామని చెబుతోంది. మరోపార్టీ రైతులకు రూ.6,000 ఇస్తామని చెబుతోంది. మన డబ్బునే పన్నుల రూపంలో తీసుకొని, ఓ స్వచ్ఛంద సంస్థల్లా ఇస్తామని ఆ పార్టీలు చెబుతున్నాయని ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించారు.
ప్రతిపౌరుడి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని భాజపా చెప్పిన మాట ఏమైందని ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ అడిగారు. ఆ పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయి. అంతేగానీ, వారి మేనిఫెస్టోల్లో ప్రకటించిన అంశాల్లో ఓ విజన్‌గానీ, మంచి ఉద్దేశంగానీ లేదన్నారు.