లోక్‌సభ మూడో దశలో 65.61 శాతం పోలింగ్

0
64

లోక్‌సభ ఎన్నికల మూడో విడుతలో 116 నియోజకవర్గాలకు మంగళవారం పోలింగ్ జరిగింది. ఒక్క వెస్ట్ బెంగాల్ మినహా మిగిలిన అంతటా ప్రశాంతంగా ముగిసింది. సగటున 65.61 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎలక్షన్ కమిషన్ అధికారులు తెలిపారు.

పశ్చిమబెంగాల్‌లో జరిగిన హింసలో ఒకరు మరణించగా, పలువురు గాయపడ్డారు. యథారీతిగా అనేక ప్రాంతాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు మరోసారి మొరాయించాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో రెండు గంటలు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. అనంత్‌నాగ్ నియోజకవర్గంలో అత్యల్పంగా 13.61 శాతం పోలింగ్ నమోదైంది.

ప్రధాని నరేంద్ర మోడీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, ఆ పార్టీ సీనియర్ నేత ఎల్‌కే.అద్వానీ, పలువురు కేంద్ర మంత్రులు మూడో విడతలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రధాని మోడీ ఓటు వేసిన అనంతరం రోడ్‌షో నిర్వహించడం వివాదాస్పదమైంది.

మూడో విడుత ముగింపుతో ఇప్పటివరకు 17 రాష్ట్రాలు, ఐదు కేంద్రపాలిత ప్రాంతాల్లో పోలింగ్ ప్రక్రియ సంపూర్ణంగా ముగిసింది. మొత్తంగా మూడు విడుతల్లో 302 నియోజకవర్గాలకు పోలింగ్ ప్రక్రియ పూర్తయింది.

గుజరాత్, కేరళలోని మొత్తం లోక్‌సభ స్థానాలు, కర్ణాటకలోని సగం (14) సీట్లకు పోలింగ్ జరిగింది. మహారాష్ట్రలో 14, ఛత్తీస్‌గఢ్‌లో 7, ఒడిశాలో ఆరు, అసోంలో 4, బీహార్, పశ్చిమబెంగాల్‌లో ఐదేసి సీట్లు, గోవాలో 2, జమ్మూకాశ్మీర్, దాద్రానగర్ హవేలీ, దామన్ డియు, త్రిపురలోని ఒక్కో స్థానానికి పోలింగ్ నిర్వహించారు.

లోక్‌సభతోపాటే ఒడిశా అసెంబ్లీలోని 45 సీట్లకు కూడా పోలింగ్ నిర్వహించారు. కేరళ, అసోం, ఉత్తర్‌ప్రదేశ్‌లోని పలు నియోజకవర్గాల పరిధిలో ఈవీఎంలు పనిచేయలేదు. దీంతో ఆయా ప్రాంతాలలో పోలింగ్ రెండు నుంచి మూడు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది.