వారణాసిలో నరేంద్ర మోడీ : కాంగ్రెస్ ప్రత్యర్థిగా బీజేపీ మాజీ నేత

0
47

వారణాసి లోక్‌సభ స్థానం నుంచి నరేంద్ర మోడీ మరోమారు పోటీ చేస్తున్నారు. ఈయన ప్రత్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి అజయ్ రాయ్‌ని బరిలోకి దించింది.

నిజానికి ఈ స్థానం నుంచి కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ వాద్రా.. పోటీ చేస్తారన్న ఊహాగానాలు వచ్చాయి. వీటికి ఇపుడు తెరపడింది. ఆ స్థానం నుంచి అజయ్‌ రాయ్‌ని కాంగ్రెస్‌ తమ అభ్యర్థిగా గురువారం ప్రకటించింది. దీంతో దేశవ్యాప్తంగా ఆసక్తి కలిగించిన మోదీ-ప్రియాంక పోరు ప్రారంభం కాకుండానే ముగిసినట్లయింది.

కాగా 2014 లోక్‌సభ ఎన్నికల్లోనూ మోదీపై వారాణసీ నుంచి పోటీ చేసిన అజయ్‌రాయ్‌ మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. ఈసారి కూడా తిరిగి ఆయననే బరిలో నిలపాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది.

ఎన్నికల ప్రచారంలో భాగంగా.. పార్టీ ఆదేశిస్తే వారాణసీ నుంచి పోటీ చేయడానికి తాను సిద్ధమేనని ప్రియాంక పలుసార్లు ప్రకటించడం, వారాణసీ అభ్యర్థి ఎంపికపై సస్సెన్స్‌ త్వరలోనే వీడిపోతుందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ వ్యాఖ్యానించడం తెలిసిందే.

అయితే ఆ సస్పెన్స్‌కు రెండు రోజులకే తెరదించుతూ ప్రియాంకకు బదులుగా అజయ్‌ రాయ్‌ పేరును పార్టీ ప్రకటించింది. ఉత్తరప్రదేశ్‌ శాసనసభకు ఐదుసార్లు ప్రాతినిధ్యం వహించిన అజయ్‌రాయ్‌.. వారాణసీ ప్రాంతంలో బలమైన నాయకుడు.

బీజేపీ విద్యార్థి విభాగం సభ్యుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన రాయ్‌.. బీజేపీ టికెట్‌పై 1996-2007 మధ్య మూడుసార్లు వరుసగా కోలస్లా నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. లోక్‌సభ టికెట్‌ నిరాకరించడంతో ఆయన బీజేపీని వీడి సమాజ్‌వాది పార్టీలో చేరారు.

2009 లోక్‌సభ ఎన్నికల్లో ఎస్పీ తరఫున పోటీ చేసి ఓటమి చెందారు. అనంతరం 2009లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా వారాణసీ నుంచి పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు.