తెలంగాణలో షీ టీమ్స్.. ఆంధ్రప్రదేశ్‌లో శక్తి టీమ్స్.. రేవ్ పార్టీ ఎఫెక్ట్..

0
44
She Teams
She Teams

తెలంగాణలో మహిళల భద్రత కోసం షీ టీమ్స్‌ను కేసీఆర్ సర్కారు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని అన్ని పోలీస్ కమిషనరేట్లలో షీ టీమ్స్ ను ప్రవేశ పెడతామని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రకటించారు. మహిళలకు భద్రత, భరోసా కల్పిస్తున్న షీ టీమ్స్ ని ఆయన అభినందించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో మహిళల రక్షణకు పెద్ద పీట వేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో షీ టీమ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోలీస్ ఎక్స్ పోని ఇటీవల హోంమంత్రి ప్రారంభించారు.

రాష్ట్రంలో సీసీటీవీలు, షీ టీమ్ ల ఏర్పాటు, పోలీసుల పనితీరుతో నేరం చేయాలంటే భయపడే పరిస్థితి ఏర్పడిందని హోంమంత్రి నాయిని చెప్పారు. రాష్ట్రానికి హోం మంత్రిగా ఉండటం గర్వంగా ఉందన్నారు. సీసీటీవీ కెమెరాలు నేరాలను నిరోధించడానికి, ఛేదించడానికి తోడ్పడుతున్నాయని తెలిపారు. పోలీసుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని వివరించారు.

మూడు సంవత్సరాలుగా దేశంలోనే బెస్ట్ క్వాలిటీ సిటీగా హైదరాబాద్ రావడానికి షీ టీమ్స్ కారణమని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి చెప్పారు. షీ టీమ్స్ వచ్చాక మహిళలకు రక్షణ దొరికిందని, మహిళలు భయపడే పరిస్థితి పోయిందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న సినీ నటి రాశిఖన్నా కొనియాడారు. ఆన్ లైన్ లో ఫిర్యాదు చేసే అవకాశం ఉండటంతో అమ్మాయిలకు ధైర్యం ఏర్పడిందన్నారు.

ఈ నేపథ్యంలో షీ టీమ్స్ తరహాలో ఏపీలోనూ మహిళలతో పోలీస్ దళాలు ఏర్పాటు చేస్తున్నారు. విశాఖపట్నంలో ‘శక్తి’ టీమ్స్ పేరిట ఏర్పాటైన మహిళా పోలీస్ దళాలను రాష్ట్ర డీజీపీ ఆర్పీ ఠాకూర్ ప్రారంభించారు. ఈ ‘శక్తి’ టీమ్ కార్యకలాపాల కోసం 5 కార్లు, 26 హోండా యాక్టివాలు కేటాయించారు.

విశాఖలో ఇటీవల రేవ్ పార్టీ జరిగిన నేపథ్యంలో డ్రగ్స్ మాఫియా తెరపైకి రావడం తనను కలచివేసిందని డీజీపీ ఠాకూర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఫిర్యాదులు, సమాచారం కోసం ప్రత్యేకంగా ఫోన్ నంబర్ ను కూడా అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.