వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ నిందితుడిగా ఉన్న ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో ప్రస్తుత ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం ఏ-11 ముద్దాయిగా ఉన్నారని.. అయినా ఆయనకింకా బుద్ధి రాలేదని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర కో కన్వీనర్ సిరిపురపు శ్రీధర్ మండిపడ్డారు.
ఆయన గుంటూరులో మాట్లాడుతూ, ‘ఎల్వీ కేవలం ప్రభుత్వ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి మాత్రమేనని గుర్తించుకోవాలి. మూడు వారాల సంబరానికి ఓవరాక్షన్ చేస్తున్నారు. ఎల్వీ అవినీతి కేసులో నిందితుడిగా ఉన్నప్పుడు ఆయనపై ఐవైఆర్ కృష్ణారావు, మిగిలిన విశ్రాంత ఐఎఎస్‌లు ఎందుకు సానుభూతి చూపలేదని ప్రశ్నించారు.
పైగా ఇప్పుడు ఆయనపై లేనిపోని ప్రేమ చూపుతూ రాష్ట్ర రాజకీయాల్లో ఆయనను పావుగా వాడుకుంటూ ఆయన భుజంపై తుపాకీ పెట్టి చంద్రబాబును కాల్చాలని ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు.
కోట్లాది మంది భక్తులు విశ్వసించే కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వరుడిని అప్రతిష్ఠ పాల్జేసే విధంగా రెండేళ్లుగా బీజేపీ, వైసీపీ సంయుక్తంగా కుట్ర రాజకీయాలు చేస్తున్నాయని శ్రీధర్ మండిపడ్డారు. మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పథకం ప్రకారం టీటీడీ ప్రతిష్ఠను భ్రష్టు పట్టిస్తున్నారన్నారు.