కాంగ్రెస్ పార్టీకి 50 సీట్లు కూడా రావు : నరేంద్ర మోడీ జోస్యం

0
54

ఈ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి 50 సీట్లు కూడా రావని ప్రధాని నరేంద్ర మోడీ జోస్యం చెప్పారు. ‘చాలా చోట్ల కాంగ్రెస్‌ ఓడిపోతోంది. ఇపుడు ప్రశ్నల్లా.. 2014లో వచ్చిన బలం కంటే బీజేపీ ఎన్ని సీట్లు ఎక్కువగా సాధించగలదు? ఎన్‌డీఏ మెజారిటీ ఎంత పెరుగుతుందీ.. అనేదే! అంచేత మీరు మీ ఓటును వృధా చేయకండి. అధికారంలోకొచ్చే పార్టీకి ఓటేయండి. పనిచేసే ప్రభుత్వానికి, పటుతరమైన పార్టీకి ఓటెయ్యండి’ అని ఆయన ఓటర్లకు పిలుపునిచ్చారు.

అంతకుముందు వారాణసి లోక్‌సభ స్థానంలో పోటీ చేసేందుకు నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. ఆ తర్వాత మధ్యప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఢిల్లీలోని తుగ్లక్‌ రోడ్డులో కాంగ్రెస్‌ నేతల ఇళ్లపై ఐటీ దాడులను ప్రస్తావించారు. ‘నామ్‌దారీ (రాహుల్‌) ప్రచార ఖర్చంతా ఆ స్కాం సొమ్ము ద్వారానే సాగుతోంది. తమను టార్గెట్‌ చేశారని వారు తెగ అరుస్తున్నారు. దాడులు ఎందుకు జరుగుతాయి? తప్పు జరిగితేనే దాన్ని బట్టబయలు చేయడానికి జరుగుతాయి. ఎవ్వర్నీ వదలం. రాహుల్‌నూ, ఆయన భృత్యుల్నీ … ఎవ్వరినీ! అనుమానమొస్తే ప్రధాని నివాసంలోనూ సోదాలు జరుగుతాయి’ అని ఆయన ప్రకటించారు.

నోట్ల రద్దు గురించి కూడా ప్రస్తావిస్తూ, ‘అవినీతి ద్వారా సంపాదించిన సొమ్మును కాంగ్రెస్‌ నేతలు, వారి సన్నిహితులు రియాల్టీ రంగంలో పెట్టారు. పెద్ద నోట్ల రద్దు వల్ల ఇళ్ల ధరలు తగ్గిపోయాయి. అందుకే వారు నోట్ల రద్దు నిర్ణయాన్ని తెగ విమర్శిస్తున్నారు. నిజానికి మెజారిటీ ప్రజలు ఆనాటి మా నిర్ణయాన్ని మెచ్చుకున్నారు’ అని నరేంద్ర మోడీ చెప్పుకొచ్చారు.