బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తూ 270 మంది మృత్యువాత.. ఎక్కడ?

0
50

భారత్ వంటి దేశాల్లో జరిగే ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ఉపయోగిస్తున్నారు. కానీ, కొన్ని దేశాల్లో ఇప్పటికీ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. ఈ విధానంలో ఎన్నికలు జరిగే దేశాల్లో ఇండోనేషియా ఒకటి. ఈ దేశంలో పది రోజుల క్రితం ఎన్నికలు జరిగాయి. ఇవి చరిత్ర సృష్టించాయి కూడా.

ఈ నెల 17వ తేదీన జరిగిన ఎన్నికల్లో తొలిసారి 260 మిలియన్ల మంది ఎన్నికల్లో భాగస్వాములయ్యారు. ఖర్చును భారీగా తగ్గించే ఉద్దేశంతో అధ్యక్ష, జాతీయ, ప్రాంతీయ పార్లమెంటరీ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరిగాయి. ఒకే దశలో జరిగిన ఎన్నికల్లో 80 శాతం మేరకు పోలింగ్ నమోదైంది. మొత్తం 193 మిలియన్ల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరికోసం 8 లక్షల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఒక్కో ఓటరూ ఐదు బ్యాలెట్ పేపర్లపై తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఆ తర్వాత ఓట్ల లెక్కింపు చేపట్టారు. అనంతరం ఎన్నికల ఫలితాలు వెల్లడించేందుకు చేసిన ప్రయత్నంలో 270 మందికిపైగా ఎన్నికల సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. కోట్లాది బ్యాలెట్ పేపర్లను చేతులతో గంటల తరబడి లెక్కించడంతో అలసటకు సంబంధించిన సమస్యలతో వీరు మృతి చెందినట్టు ఆదివారం ఓ అధికారి తెలిపారు.

పోలింగ్ ముగిసిన అనంతరం కోట్లాది బ్యాలెట్ పేపర్లను లెక్కించే క్రమంలో శనివారం రాత్రి వరకు 272 మంది ఎన్నికల సిబ్బంది మృతి చెందినట్టు జనరల్ ఎలక్షన్ కమిషన్ (కేపీయూ) అధికార ప్రతినిధి అరీఫ్ ప్రియో సుశాంతో తెలిపారు. విరామం లేకుండా అత్యధిక పనిగంటలు పనిచేయడం వల్ల అలసిపోవడం కారణంగా వీరంతా మృతి చెందినట్టు తెలిపారు. అలాగే, 1,878 మంది అస్వస్థతకు గురైనట్టు పేర్కొన్నారు.

అనారోగ్యం పాలైన ఎన్నికల సిబ్బందికి చికిత్స సదుపాయాలు కల్పించాలని ఈ నెల 23నే ఆరోగ్య శాఖ సర్క్యులర్ జారీ చేసింది. మృతి చెందిన వారికి పరిహారం ఇచ్చేందుకు ఆర్థిక శాఖ కసరత్తు చేస్తున్నట్టు సుశాంతో తెలిపారు.