కేరళ రాష్ట్రంలో ఓ దారుణం వెలుగులోకి వచ్చింది. చాటింగ్ యాప్ ద్వారా పరిచయమైన నలుగురు వ్యక్తులు తమ భార్యలను మార్చుకున్నారు. ఇందులో ఓ మహిళ.. ఈ పాడు పని చేసేందుకు ఇష్టపడకపోయినా.. ఆమె భర్త బలవంతం చేసి పరాయి పురుషుల వద్దకు పంపాడు. అలాగే, తాను కూడా ఆ నలుగురు వ్యక్తుల భార్యలతో పడక సుఖం పంచుకున్నాడు.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కేరళ రాష్ట్రంలోని అలెప్పీ జిల్లా కయకుళానికి చెందిన ఓ మహిళ ట్రావెల్ ఏజెన్సీలో పని చేస్తుంది. ఈమె భర్త మాత్రం అపరిచత వ్యక్తులతో చాటింగ్ చేస్తూ కాలం వెళ్లదీస్తూ వచ్చాడు. ఈ క్రమంలో ఓ చాటింగ్ యాప్లో చాటింగ్ చేస్తుండగా నలుగురు సంబంధం లేని వ్యక్తులు పరిచయమయ్యారు.
ఆ వ్యక్తుల్లో ఒకతను నిందితుడి భార్యపై మోజు పడ్డాడు. ఆ విషయాన్ని అతనికి చెప్పాడు. భార్య గురించి తప్పుగా మాట్లాడిన అతనికి తగిన బుద్ధి చెప్పాల్సింది పోయి తన భార్యతో కలిసే ఏర్పాటు చేస్తానని నిందితుడు మాటిచ్చాడు. మాటివ్వడమేకాకుండా తన భార్యకు మాయమాటలు చెప్పి మోజు పడిన వ్యక్తి కారులోకి బలవంతంగా ఎక్కించి పంపించాడు. ఇలా ఒకరి వద్దకు కాదు నలుగురు వివాహిత వ్యక్తుల వద్దకు బెదిరించి బలవంతంగా తన భార్యను పంపాడు. అలాగే, ఆ నలుగురు వ్యక్తుల భార్యలతో నిందితుడు కూడా పడకసుఖం పంచుకునేవాడు.
అయితే, ఈ తరహా పని చేయడానికి తనకేమాత్రం ఇష్టంలేదని చెప్పినా వినిపించుకోకుండా కొల్లాంలోని కేరళపురానికి తన భార్యను తీసుకెళ్లి.. చాట్లో పరిచయమైన భార్యాభర్తలతో కలిసి గడపాల్సిందిగా ఆమెను బలవంతం చేశాడు. తన భార్య ఒప్పుకోకపోవడంతో ఆమెతో గొడవకు దిగాడు. గ్రూప్ శృంగారంలో పాల్గొనాల్సిందేనంటూ ఒత్తిడి చేశాడు.
ఇక భరించలేకపోయిన భార్య గతవారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ భార్యల మార్పిడి వ్యవహారం గురించి దర్యాప్తు చేసిన పోలీసులు విస్తుపోయారు. పోలీసులు ఆమె భర్తతో పాటు ఫిర్యాదులో పేర్కొన్న నలుగురు వివాహితులను అదుపులోకి తీసుకున్నారు. ఆ నలుగురూ కేరళలోని నాలుగు వేరువేరు జిల్లాలకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.