శ్రీనివాస రెడ్డి ఓ ఉన్మాది… చెట్టుకు కట్టేసి కొట్టడంతో…

0
39

యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్ గ్రామంలో వెలుగుచూసిన వరుస హత్యల మిస్టరీలో ప్రధాన నిందితుడు శ్రీనివాస రెడ్డి ఓ ఉన్మాది అని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు.

ఈ వరుస హత్యల కేసులోని మిస్టరీని పోలీసులు ఛేదించడమే కాకుండా, శ్రీనివాసరెడ్డిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఇదే అంశంపై సీపీ మహేష్ భగవత్ మాట్లాడుతూ, శ్రీనివాస్ రెడ్డిది మొదటి నుంచి ఉన్మాద స్వభావం అని వెల్లడించారు. శ్రీనివాస్ రెడ్డి లిఫ్ట్ మెకానిక్‌గా పనిచేస్తుంటాడని తెలిపారు.

ఓసారి కర్నూలులో స్నేహితులతో కలిసి వేశ్యను గదికి తీసుకువచ్చి, ఆపై ఆమె డబ్బుల కోసం గొడవపడితే చంపేశాడని వివరించారు. ఆ వేశ్య మృతదేహాన్ని అపార్ట్‌మెంట్ పైభాగంలో ఉన్న నీళ్లులేని వాటర్ ట్యాంక్‌లో వేశారని చెప్పారు. అయితే, సొంతూరు హాజీపూర్‌లో వరుస హత్యలకు చాన్నాళ్ల కిందట జరిగిన ఓ సంఘటన కారణమన్నారు.

అప్పట్లో శ్రీనివాస్ రెడ్డిపై ఓ ఈవ్ టీజింగ్ కేసు నమోదైతే, లోక్ అదాలత్‌లో రాజీపడ్డారని, కానీ అమ్మాయిని వేధించడంతో గ్రామస్తులు అతడిని చితకబాదారని సీపీ తెలిపారు. ఊర్లో వాళ్లు తనను చెట్టుకు కట్టేసి మరీ కొట్టడాన్ని అవమానంగా భావించాడని, ఆ ఘటనను మనసులో పెట్టుకుని గ్రామస్తులపై ఏ విధంగానైనా ప్రతీకారం తీర్చుకోవాలని భావించి అమ్మాయిలపై అత్యాచారం చేసి బావిలో పూడ్చిపెట్టేవాడని సీపీ మహేష్ భగవత్ వివరించారు.