నరేంద్ర మోడీ వల్లే ఉగ్రవాదం : ఒమర్ అబ్దుల్లా

0
78

గత ఐదేళ్ళ కాలంలో జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఉగ్రవాదం హెచ్చుమీరి పోవడానికి ప్రధాన కారణం ప్రధాని నరేంద్ర మోడీయేనని జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆరోపించారు. సోఫియాన్‌లో ఓ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ మోడీపై విమర్శలు గుప్పించారు.

2014కు ముందు ఉగ్రవాదంవైపు మళ్లిన యువకుల సంఖ్య కంటే ఇప్పుడు ఆ సంఖ్య ఎన్నో రెట్లు పెరిగిందని చెప్పారు. 2014తో పోలిస్తే రాష్ట్రంలో పోలింగ్ శాతం కూడా దారుణంగా పడిపోయిందన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం జమ్మూకాశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు ఉద్దేశ్యపూర్వకంగానే నిర్వహించడం లేదని ఒమర్ అబ్దుల్లా మండిపడ్డారు.

1996 తర్వాత రాష్ట్రంలో సకాలంలో అసెంబ్లీకి ఎన్నికలు జరగకపోవడం ఇదే తొలిసారని విమర్శించారు. 40 మంది తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారన్న మోడీ వ్యాఖ్యలపై స్పందిస్తూ… ఎమ్మెల్యేలను కొనడం ద్వారా ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం బీజేపీకి అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. గోవాలో ఇదే చేశారని, కర్ణాటకలో కూడా ఇదే చేయాలనుకున్నారని, అయితే కోర్టు అడ్డుకోవడంతో వారి ప్రయత్నాలు ఫలించలేదని అన్నారు.