మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్జున్ రెడ్డి ఫేమ్ విజయ్ దేవరకొండ హాజరయ్యారు. మహేశ్ బాబు, పూజా హెగ్డే జంటగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన చిత్రం మహర్షి. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని పీపుల్స్ ప్లాజాలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మహర్షి చిత్ర బృందంతో పాటు సీనియర్ హీరో వెంకటేశ్ కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, కాలేజ్ డేస్ నుంచి తాను మహేశ్ బాబు ఫ్యాన్ అని చెప్పారు. ఇంటర్‌లో ఉన్నప్పుడు “మహేశ్ బాబు” అనేవాడ్నని, కానీ హీరో అయ్యాక మహేశ్ బాబును “సర్” అని పిలవాల్సి వస్తోందని తెలిపారు. తెలియకుండానే ఆ గౌరవం వచ్చేస్తోందని అన్నారు.
అయినప్పటికీ మధ్య మధ్యలో ఒక్కోసారి ‘మహేశ్ బాబు’ అని అలవాటుగా అనేస్తుంటానని విజయ్ చెప్పారు. ఓసారి తన తల్లిదండ్రులతో మహేశ్ బాబు సినిమా చూసేందుకు దిల్ సుఖ్ నగర్ కోణార్క్ థియేటర్‌కు వెళితే టికెట్లు దొరకలేదని చెప్పారు. అప్పట్నించి అమ్మాయిల క్యూలో ఎవర్నయినా తెలిసిన అమ్మాయిలను పంపించి టికెట్లు సంపాదించే తెలివితేటలు అలవర్చుకున్నానని అన్నారు.
