ఐపీఎల్2019: ఫైనల్‌కు చేరిన చెన్నై.. ముంబైతో టైటిల్ పోరు

0
63
chennai super kings team
chennai super kings team

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2019 టోర్నీ చివరి అంకానికి చేరుకుంది. ఈ పోటీల్లో భాగంగా, ఫైనల్ మ్యాచ్ ఆదివారం ముంబైలో జరుగనుంది. టైటిల్ పోరులో చెన్నై సూపర్ కింగ్స్‌ – ముంబై ఇండియన్స్ జట్ల మధ్య తలపడనుంది.

అంతకుముందు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అనూహ్యంగా ఫైనల్‌కు చేరుకున్న విషయ తెల్సిందే. శుక్రవారం విశాఖపట్టణం వేదికగా ఢిల్లీ కేపిటల్స్‌తో జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో చెన్నై అలవోక విజయం సాధించింది. ఢిల్లీ నిర్దేశించిన 148 పరుగుల విజయ లక్ష్యాన్ని మరో ఓవర్ మిగిలి ఉండగానే నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.

ఆదివారం ముంబైతో జరిగే ఫైనల్లో చెన్నై తాడోపేడో తేల్చుకోనుంది. సుదీర్ఘ కాలం తర్వాత తమకు దక్కిన సువర్ణావకాశాన్ని ఢిల్లీ చేజేతులా నాశనం చేసుకుంది. చెన్నై బౌలర్ల ముందు ఢిల్లీ బ్యాట్స్‌మెన్ వికెట్లు సమర్పించుకున్నారు. ఫలితంగా ఢిల్లీ అభిమానులకు తీవ్ర నిరాశ మిగిల్చారు. ఇక, ఫైనల్లోకి అడుగుపెట్టడం చెన్నైకి ఇది ఏకంగా ఎనిమిదోసారి కావడం గమనార్హం.

కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీకి ఆది నుంచే కష్టాలు మొదలయ్యాయి. కీలక మ్యాచ్‌లో ఓపెనర్ పృథ్వీషా (5) శిఖర్ ధావన్ (18) సహా టాపార్డర్ మొత్తం చేతులెత్తేసింది. జట్టును ఆదుకుంటాడనుకున్న రిషభ్ పంత్ కూడా ఎటువంటి మెరుపులు లేకుండా 38 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు.

ఢిల్లీ ఆటగాళ్లలో ఐదుగురు సింగిల్ డిజిట్‌కే అవుటయ్యారంటే ఎంత చెత్తగా ఆడారో అర్థం చేసుకోవచ్చు. చెన్నై బౌలర్ల దెబ్బకు ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది.

ఆ తర్వాత 148 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ మరో ఓవర్ మిగిలి ఉండగానే ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఓపెనర్లు ఫా డుప్లెసిస్ (50), షేన్ వాట్సన్ (50) ఇద్దరూ అర్ధ సెంచరీలతో చెలరేగడంతో చెన్నై అలవోకగా విజయాన్ని అందుకుంది. అంబటి రాయుడు 20 పరుగులు చేశాడు.

ఈ మ్యాచ్‌లో 39 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్‌తో 50 పరుగులు చేసిన ఫా డుప్లెసిస్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద అవార్డు’ లభించింది. ఈనెల 12 (ఆదివారం) జరిగే టైటిల్ పోరులో ముంబై ఇండియన్స్‌తో ధోనీ సేన తలపడనుంది.