ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురించి ప్రముఖ పత్రిక టైమ్స్ మ్యాగజైన్ వివాదాస్పద కథనాన్ని ప్రచురించింది. అమెరికాకు చెందిన టైమ్ మ్యాగజైన్ తన మే 20వ తేదీ సంచిక ముఖచిత్రంపై వివాదాస్పద శీర్షికతో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రాన్ని (క్యారికేచర్) ప్రచురించింది.
ఈ చిత్రం పక్కన ఇండియాస్ డివైడర్ ఇన్ చీఫ్ (భారతదేశాన్ని విడగొట్టే నాయకుడు)గా పేర్కొంటూ శీర్షిక ప్రచురించడం జాతీయంగా, అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఈ వ్యాసాన్ని ఆతిశ్ తసీర్ రాశారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశంలో నివసిస్తున్న ప్రజలు మోడీ ప్రభుత్వాన్ని మరో 5 ఏండ్లు భరిస్తారా? అనే వాక్యాన్ని శీర్షికగా ఉంచారు. వ్యాసంలో మాజీ ప్రధాని జవహార్‌లాల్ నెహ్రూ లౌకిక భావాలు, మోడీ హయాంలో నెలకొన్న సామాజిక ఒత్తిళ్లను పోల్చారు.
దేశంలో హిందూ, ముస్లింల మధ్య సోదరభావ వాతావరణాన్ని నెలకొల్పే ఉద్దేశమే మోడీ ప్రభుత్వానికి లేదన్న కోణంలో వ్యాసం సాగింది. వ్యాసం ఆసాంతం హిందూ-ముస్లింల సఖ్యత, సంబంధాలను వివరిస్తూ.. మోడీ హిందువుల పక్షపాతి అని రచయిత తన భావాలను వ్యక్తపరిచారు.