కమల్ హాసన్ నాలుక కత్తిరించాలి : తమిళనాడు మంత్రి

0
61

స్వతంత్ర భారతదేశంలో తొలి తీవ్రవాది హిందువేనంటూ వ్యాఖ్యానించిన సినీ నటుడు కమల్ హాసన్ వ్యాఖ్యలపై అన్నాడీఎంకే సీనియర్ నేత, తమిళనాడు రాష్ట్ర మంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ మండిపడ్డారు. కమల్ నాలుక కత్తిరించాలని డిమాండ్‌ చేశారు. మైనార్టీల ఓట్ల కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.

ఓ వ్యక్తి (గాడ్సే) చర్యల కారణంగా మొత్తం (హిందూ)మతాన్ని నిందించలేమన్నారు. కమల్ హాసన్‌పై ఎన్నికల సంఘం(ఈసీ) చర్యలు తీసుకోవాలని, ఆయన పార్టీని నిషేధించాలని కోరారు. మైనార్టీలను మచ్చిక చేసుకునేందుకు హిందువులను చెడుగా చూపించడం ద్వారా కాంగ్రెస్, కమ్యూనిస్టుల బాటలోనే వెళ్తున్నారని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ విమర్శించారు.

మరోవైపు, కమల్‌ హాసన్‌కు కాంగ్రెస్ పార్టీ, ద్రవిడర్ కళగం(డీకే) సంస్థ మద్దతు పలికాయి. నాథూరాం గాడ్సే ఆరెస్సెస్ వద్ద శిక్షణ తీసుకున్నాడని డీకే అధినేత కే వీరమణి ఆరోపించారు. టీఎన్‌సీసీ(తమిళ్ కాంగ్రెస్ కమిటీ) అధ్యక్షుడు కేఎస్ అళగిరి మాట్లాడుతూ కమల్ వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు కనిపించలేదన్నారు. ఆరెస్సెస్ కూడా ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌స్టేట్ (ఐఎస్)వంటిదేనని, రెండు సంస్థలూ తమకు వ్యతిరేకంగా మాట్లాడేవారిపై దాడులు చేస్తాయని ఆయన గుర్తుచేశారు.