గుజరాత్ మోడల్ అంటే ఇదేనా? చంద్రబాబు

0
58

బీజేపీ నేత సాధ్వీ ప్రజ్ఞా సింగ్ చేసిన తాజా వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు స్పందించారు. గాంధీని పొట్టనబెట్టుకున్న నాథూరాం గాడ్సేను గొప్ప దేశభక్తుడు అంటూ సాధ్వీ ప్రజ్ఞా ఆకాశానికెత్తడంపై ఆయన ట్వీట్ చేశారు.

“మొదట మహారాష్ట్ర పోలీసు అధికారి హేమంత్ కర్కరేను దూషించారు. ఆయన ఇప్పుడు లేరు కూడా. ఇప్పుడు జాతిపిత మహాత్ముడిపై పడ్డారు. అహింసాదూత, ప్రపంచానికి స్ఫూర్తి ప్రదాత అయిన మహాత్మా గాంధీపైనే విమర్శలు చేస్తున్నారు. ఇదేనా మీరు చెబుతున్న గుజరాత్ మోడల్? ఈ సందేశాన్నే భారతదేశమంతా వ్యాప్తి చేయాలనుకుంటున్నారా?” అంటూ ప్రశ్నించారు.

జాతిపితను చంపినవారిని గొప్ప దేశభక్తులుగా బీజేపీ నాయకులు కీర్తించడం చూస్తుంటే ఎంతో బాధ కలుగుతోందన్నారు. బీజేపీకి చెందిన నేతలే కాదు, ప్రధాని నరేంద్ర మోడీ సైతం ఇలాంటి వారికి మద్దతుగా నిలవడం చూస్తుంటే వారి దేశభక్తి ఏంటో అర్థమవుతోందని వ్యాఖ్యానించారు.

అలాగే, చంద్రగిరి అసెంబ్లీ నియోజక వర్గం రీపోలింగ్ అంశంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదు పోలింగ్ బూత్‌ల పరిధిలో రీపోలింగ్ నిర్వహించే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.

నిబంధనలకు విరుద్ధంగా ఈసీ వ్యవహరిస్తోందని లేఖలో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తామిచ్చిన ఫిర్యాదులపై ఎలాంటి విచారణ నిర్వహించపోవడం దారుణమని లేఖలో పేర్కొన్నారు. చంద్రబాబు లేఖపై ఈసీ స్పందిస్తుందో లేదో చూడాలి.