సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత భారతీయ జనతా పార్టీని మాత్రం అధికారంలోకి రానివ్వకుండా అడ్డుకోవాలన్నదే దేశంలోని విపక్ష పార్టీల నేతలందరి అభిప్రాయంగా ఉంది. ఇందుకోసం ఈ నెల 23వ తేదీన వెల్లడయ్యే ఫలితాల కంటే ముందుగానే ఢిల్లీలో సమావేశం కావాలని నిర్ణయించారు. ఇందుకోసం అనధికార కన్వీనర్ హోదాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కరితో టచ్‌లో ఉంటున్నారు.
ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ, ‘‘బీజేపీ, ఎన్డీయేకు వ్యతిరేకంగా ఎవరు కలిసి వచ్చినా కలుపుకొనిపోతాం. వారందర్నీ సంఘటితపరచి ఒకే వేదికపైకి తీసుకు రావడానికి సిద్ధంగా ఉన్నాం’ అని చెప్పారు. కాగా, ఇందులోభాగంగా శుక్రవారం ఆయన సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో కీలక చర్చలు జరపారు. శనివారం ఉదయం ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఎన్‌సీపీ నేత శరద్ పవార్‌తో చర్చిస్తారు.
అనంతరం, లక్నోకు చేరుకుని ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతిలో చర్చిస్తారు. తిరిగి ఆదివారం ఢిల్లీ చేరుకొంటారు. ఎన్నికల ఫలితాలు ప్రకటించేందుకు దాదాపు ఆరు రోజుల ముందే బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేకి బలమైన ప్రత్యామ్నాయం రూపొందించి.. దానిని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు చంద్రబాబు పావులు కదుపుతున్నారు. మే 23న ఫలితాల రోజు అంతా ఢిల్లీ చేరుకొని ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేయాలని భావిస్తున్నారు.
కాగా, యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వ ఏర్పాటులో చంద్రబాబు అనుభవం బీజేపీయేతర ఫ్రంట్ నిర్మాణానికి కలిసొస్తుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్, తెలుగుదేశం సహా 17 రాజకీయ పార్టీలు వివిధ అంశాలపై మూడు నాలుగుసార్లు సమావేశమైనందువల్ల వారి మధ్య రాజకీయ ఐక్యత సాధ్యపడే అవకాశాలున్నాయని ఈ వర్గాలు అంటున్నాయి.