22న రీశాట్-2బీ శాటిలైట్ ప్రయోగం…

0
59

దేశ సరిహద్దుల్లో ఉగ్రవాద స్థావరాలు, వారి కదలికలపై నిశిత దృష్టి సారించే రీశాట్‌-2బీ ఉపగ్రహ ప్రయోగం బుధవారం వేకువజామున చేపట్టనున్నారు. నెల్లూరు జిల్లాలోని షార్‌ కేంద్రంలో ప్రథమ ప్రయోగ వేదిక నుంచి బుధవారం తెల్లవారుజామున 5.30 గంటలకు ఈ ఉపగ్రహంతో పీఎస్‌ఎల్వీ-సీ46 రాకెట్‌ నింగిలోకి దూసుకుపోనుంది.

ఈ ప్రయోగానికి సంబంధించిన రిహార్సల్స్‌‌ను ఇస్రో శాస్త్రేవేత్తలు ఆదివారం రాత్రి విజయవంతంగా నిర్వహించారు. సోమవారం మధ్యాహ్నం షార్‌లో మిషన్‌ రెడీనెస్‌ రివ్యూ ఛైర్మన్‌ బీఎన్‌ సురేష్‌ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలోనూ, రాత్రి లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డు ఛైర్మన్‌, షార్‌ డైరెక్టర్‌ పాండియన్‌ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలోనూ రాకెట్‌ ప్రయోగానికి శాస్త్రవేత్తలు సంసిద్ధత వ్యక్తం చేశారు.

రాకెట్‌ ప్రయోగ కౌంట్‌డౌన్‌ను మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటలకు ప్రారంభించనున్నారు. ఈ ప్రయోగానికి ఇస్రో 48వ సారి పీఎస్‌ఎల్వీని ఉపయోగిస్తోంది. ఈ ప్రయోగ పర్యవేక్షణ నిమిత్తం ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ కె.శివన్‌ మంగళవారం మధ్యాహ్నం షార్‌కు చేరుకోనున్నారు. కౌంట్‌డౌన్‌ కార్యక్రమాన్ని పరిశీలించి శాస్త్రవేత్తలతో సమావేశం కానున్నారు. బుధవారం తెల్లవారుజామున 5.30 గంటలకు మిషన్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి ఇస్రో చీఫ్‌ పర్యవేక్షణలో శాస్త్రవేత్తలు పీఎస్‌ఎల్వీ-సీ46ను ప్రయోగించనున్నారు.

రీశాట్‌-2బీ ఉపగ్రహంలో ఉన్న ఎక్స్‌బాండ్‌ రాడార్‌ దేశ సరిహద్దులను అనుక్షణం పహారా కాస్తూ ఉగ్రవాద శిబిరాలు, వారి కదలికలను ఎప్పటికప్పుడు పసిగడుతూ ఛాయాచిత్రాలు సహా సమాచారాన్ని అందజేయనుంది. అలాగే పనిలో పనిగా దేశ వ్యవసాయ, అటవీ రంగాలపై సమగ్ర సమాచారాన్నీ అందించనుంది. ప్రకృతి వైపరీత్య సమయాల్లో సహాయకారిగా నిలవనుంది. ఈ ఉపగ్రహం ఐదేళ్ల పాటు పని చేసేలా ఇస్రో రూపొందించింది.