సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు మే 23వ తేదీన చేపట్టనున్నారు. ఇందుకోసం ఎన్నికల సంఘం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. అవేంటో తెలుసుకుందాం.
* మాక్‌పోల్ ఓట్లను, సంబంధిత స్లిప్‌లను తొలగించకుండా వదిలేసిన ఈవీఎంలు ఎన్ని ఉన్నాయో ముందుగానే ఆయా అభ్యర్థులకు తెలియచేయాలి.
* సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో ఐదు ఈవీఎంల వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలి. అయితే… దీనికోసం మాక్‌పోల్ స్లిప్పులు తొలగించని వీవీప్యాట్లను పరిగణనలోకి తీసుకోకూడదు.
* మాక్‌పోల్ ఓట్లు తొలగించని ఈవీఎంలు, వీవీప్యాట్‌లు ఉన్న పోలింగ్ కేంద్రాల వివరాలను.. కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభానికి ముందే.. పోటీలో ఉన్న అభ్యర్థులకు తెలియజేయాలి.
* ఓట్ల లెక్కింపు సమయంలో ఇలాంటి ఈవీఎంలను పక్కన పెట్టాలి. రౌండు లెక్కింపు సమయంలో ఈ ఈవీఎంల వంతు వచ్చినప్పుడు ఆ ఈవీఎం కంట్రోల్ యూనిట్‌కు కేటాయించిన స్థలాన్ని ఖాళీగా ఉంచాలి. ఇలా ఎందుకు చేస్తున్నారనే అంశాన్ని అభ్యర్థులకు, కౌంటింగ్ ఏజెంట్లకు రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు వివరించాలి.
* ఈవీఎం ఓట్ల అన్ని రౌండ్ల లెక్కింపు పూర్తయ్యాక.. మాక్‌పోల్ ఓట్లు తొలగించని కారణంగా పక్కన పెట్టిన వీవీప్యాట్ల స్లిప్పులు లెక్కించాలి. వీటిని కూడా అభ్యర్థులవారీగా వారికి వచ్చిన ఓట్లకు కలిపి తుది ఫలితాలు వెల్లడించాలి.
* ఈవీఎంలో పోలైన ఓట్లకు, ఫామ్ 17సీలో నమోదైన ఓట్లకు తేడా ఉంటే మాక్‌పోల్ ఓట్లు తొలగించకపోవడమే దానికి కారణంగా భావించాలి.
* సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఒక నియోజకవర్గంలో లెక్కించాల్సిన 5 వీవీప్యాట్లలోని స్లిప్పుల సంఖ్యకు, దానికి సంబంధించిన ఈవీఎంలో నమోదైన ఓట్ల సంఖ్యకు తేడా వస్తే.. అవి సరిపోలేవరకు వాటిని లెక్కించాలి.
* కౌంటింగ్ సూపర్‌వైజర్ ఈ బాధ్యత తీసుకుని జాగ్రత్తగా లెక్కించాలి. ఎన్నిసార్లు లెక్కించినా చేసినా.. ఆ రెండు సంఖ్యలు సరిపోలని పక్షంలో వీవీప్యాట్‌లో ఉన్న స్లిప్పులనే పరిగణనలోకి తీసుకుని ఫలితం ప్రకటించాలి.
* ఈవీఎంలోని ఓట్లు, వీవీప్యాట్‌లోని స్లిప్పుల సంఖ్య ఎందుకు సరిపోలలేదో, ఇందుకు కారణమేంటో విచారణ జరిపి కేంద్ర ఎన్నికల సంఘానికి తక్షణమే నివేదిక పంపాలి. దీని ఆధారంగా కమిషన్ చర్యలు తీసుకుంటుంది.
* ఈవీఎంలు సరైనవేనని.. వాటిపై ఉన్న కోడ్ ఆధారంగా అవి ఫలానా పోలింగ్ కేంద్రానికి చెందినవేనని కౌంటింగ్‌కు ముందే కౌంటింగ్ ఏజెంట్లు ధ్రువీకరించాలి. ఈ మేరకు వారి నుంచి ఎన్నికల సిబ్బంది సర్టిఫికెట్ తీసుకోవాలి. ఈ సర్టిఫికెట్ అందాకే కౌంటింగ్ ప్రారంభించాలి.