ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కుటుంబ వ్యవస్థపై గౌరవం లేదని.. ఆయనకు ఎలాంటి బంధాలు లేవని ఏపీ సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గుంటూరు సభలో తనను పదే పదే లోకేష్ తండ్రి అంటూ మోదీ పలకడం సంతోషంగా వుందని.. తాను కుటుంబ వ్యవస్థకు గౌరవం ఇచ్చే మనిషినని చెప్పారు. మోదీకి భార్య వుందని.. ఆ విషయం మీకు తెలుసా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. ట్రిపుల్ తలాక్ చెల్లదని తెలిసి కూడా చట్టాన్ని తీసుకొచ్చారన్నారు.
దివంగత ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచానని తనను మోదీ విమర్శిస్తున్నారని… గురువుకే పంగనాలు పెట్టిన చరిత్ర మోదీదని మండిపడ్డారు. అద్వానీ నమస్కారం పెడితే తిరిగి నమస్కరించని సంస్కారం ఆయనదని విమర్శించారు.
గుజరాత్‌లో మోదీ ప్రభుత్వం ముస్లింలను ఊచకోత కోస్తే… తొలుత వ్యతిరేకించింది తానేనని చెప్పారు. మోదీ రాజీనామా చేయాలని తాను డిమాండ్ చేశానని అన్నారు. మోదీ మారాడని భావించి పొత్తు పెట్టుకున్నామని.. కానీ, నమ్మించి మోసం చేశారని మండిపడ్డారు. రాష్ట్రానికి ఏదో ఇచ్చామని మోదీ చెబుతున్నారని… ఏమిచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.
రాజధానికి, పోలవరంకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన డబ్బులను కూడా వెనక్కి తీసుకున్నారని విమర్శించారు. తెలంగాణకు డబ్బులు ఇచ్చారని… మనం ఊడిగం చేయడం లేదనే మనకు ఇవ్వడం లేదని అన్నారు. మోదీ చేసిన నోట్ల రద్దు పిచ్చి తుగ్లక్ చర్య అని చంద్రబాబు ఎద్దేవా చేశారు.