జాతిపతిపై జోకులా? వేటు పడింది….

0
75
Nidhi Choudhary
Nidhi Choudhary

జాతిపితపై జోకులు వేసిన ఐఏఎస్ అధికారిణిపై మహారాష్ట్ర సర్కారు కఠిన చర్య తీసుకుంది. ఆమెను మరో చోటికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. పైగా, తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసు జారీచేసింది. ఆ అధికారిణి పేరు నిధి చౌదరి. బీఎంసీ డిప్యూటీ మున్సిపల్ కమిషనరుగా విధులు నిర్వహిస్తున్నారు.

ఇటీవల మహారాష్ట్రకు చెందిన ఆమె ఓ ట్వీట్ చేశారు. అందులో “ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాలను కూల్చివేయాలి. కార్యాలయాల్లో చిత్రపటాలను తొలగించాలి. కరెన్సీ నోట్లపై ఆయన ఫొటో తీసేయాలి. గాంధీజీని హత్య చేసిన గాడ్సేకు కృతజ్ఞతలు” అంటూ ట్వీట్ చేసింది.

దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో ఆమె ఆ ట్వీట్‌ను తొలగించారు. అయితే తాను కావాలనే ఆ వ్యాఖ్యలు చేశానని, ఇటీవల గాంధీని విమర్శిస్తూ సోషల్‌మీడియాలో ఇష్టం వచ్చినట్లు స్పందించడంతో తాను ఇలా వ్యంగ్యంగా ట్వీట్ చేశానని పేర్కొన్నారు. ఇలాంటివి చూడాల్సిన అగత్యం పట్టకుండా ఆ మహాత్ముడిని చంపిన గాడ్సేకు కృతజ్ఞతలు చెప్పానని వివరణ ఇచ్చారు.

అయితే గాడ్సేను కీర్తిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలపై పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన హోదాలో ఉండి ఈ వ్యాఖ్యలు చేసినందుకు గానూ ఆమెను వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. దీంతో మహారాష్ట్ర బీజేపీ సర్కారు స్పందించింది. బీఎంసీ డిప్యూటీ మున్సిపల్‌ కమిషనర్‌‌గా ఆమెను తొలగించి, నీటి సరఫరా, పారిశుద్ధ్య విభాగానికి బదిలీ చేసింది. అంతేగాక.. తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది.