సీఎం చంద్ర‌బాబు ఢిల్లీలో ధ‌ర్మ‌పోరాట దీక్ష‌

0
30

ఎపికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు పై కేంద్ర వైఖరికి నిరసనగా ఎపి సీఎం చంద్రబాబు ఢిల్లీ లో ధర్మ పోరాట దీక్ష చేపట్టారు. సాయంత్రం 8 గంటల వరకు దీక్ష కొనసాగింది.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎపి సీఎం చంద్రబాబు నిరసన గళం వినిపిస్తున్నారు. ఆయనను కవ్వించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ సైతం ఘాటుగా విమర్శలు చేయడం మొదలు పెట్టడంతో చంద్రబాబు తన స్వరాన్ని పెంచారు. ఇన్నిరోజులు రాష్ట్రస్థాయిలో చేసిన ధర్మపోరాట దీక్ష ఢిల్లీకి చేరింది. సీఎం చంద్రబాబుతో పాటు రాష్ట్ర మంత్రులు, టీడీపీ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర సీనియర్ నేతలు, ప్రజా సంఘాలు, ఎన్జీవోలు, విద్యార్థి సంఘాలు, పాత్రికేయ సంఘాల నేతలు దీక్షలో పాల్గొన్నారు.

పార్టీ సీనియర్ నేతలతో కలిసి సీఎం చంద్రబాబు రాజ్ ఘాట్ కు వెళ్లి మహాత్మ గాంధీ విగ్ర‌హానికి నివాళులు అర్పించి దీక్ష‌ను ప్రారంభించారు. ఏపీ భవన్ ప్రాంగణంతో పాటు చుట్టుపక్కల జస్వంత్ సింగ్ రోడ్, అశోక రోడ్, మాన్ సింగ్ రోడ్, ఆర్పీ రోడ్ సహా సెంట్రల్ ఢిల్లీలోని పలు చోట్ల అడుగడుగునా భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎలా విస్మరించిందో వివరిస్తూ ఈ ఫ్లెక్సీలను రూపొందించారు.

ధర్మ పోరాట దీక్ష తర్వాత రేపు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు, టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఒక బృందంగా వెళ్లి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలవనున్నారు. బుధవారం కూడా ముఖ్య‌మంత్రి ఢిల్లీలో మరో నిరసన దీక్షలో పాల్గొననున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా తలపెట్టిన “తానాషాహీ హఠావో – దేశ్ బచావో” ఆందోళనలో పాల్గొని సంఘీభావం తెలపనున్నారు. జంతర్‌మంతర్‌లో జరగనున్న ఈ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడుతో పాటు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, మరికొందరు విపక్ష కూటమి నేతలు హాజరుకానున్నారు.