సాగుకు ఎదురీత

0
60

నైరుతి ఆలస్యం… వర్షాలు అంతంతమాత్రం
ఊపందుకోని ఖరీఫ్‌ పంటల సాగు
చెరువులు, బోర్లలో పెరగని నీటి మట్టాలు
భారీ వర్షాల కోసం అన్నదాతల ఎదురుచూపు
ఆరుద్రలోనూ చినుకు రాలకుంటే దిగుబడులు దిగదుడుపే
బ్యాంకుల్లో పూర్తి బకాయి చెల్లిస్తేనే కొత్త పంటరుణం
మాఫీ ఆశతో బకాయి కట్టేందుకు ముందుకురాని రైతులు
జనగాం, సిద్దిపేట జిల్లాల నుంచి ‘ఈనాడు’ ప్రత్యేక ప్రతినిధి

తొలకరి ఆశలు సన్నగిల్లుతున్నాయి. నైరుతి రుతుపవనాలు ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యాయి. ఎక్కడా జలవనరుల్లోకి నీరు చేరలేదు. నాలుగు బొట్లుగా పడిన జల్లులతో నేలతల్లి దాహమే తీరలేదు. రోహిణి, మృగశిర కార్తెల్లో చినుకు జాడ లేక నిరాశే మిగిలింది. ‘ఆరు కార్తెలు పోతే.. ఆరుద్ర కార్తే దిక్కు’ అనుకుని రైతులు భారీ వర్షాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ కార్తెలో విత్తనాలు, నారు పోయకుంటే ఇక ఈ సీజన్‌లో పంట దిగుబడి పడిపోతుందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. అడపాదడపా వర్షాలు కురుస్తున్నా అవి కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యాయి. జూన్‌ తర్వాత వర్షాలు పడి విత్తులు వేసినా పంటలకు తెగుళ్ల బెడద ఉంటుందని వ్యవసాయ నిపుణులు చెబుతుండడం వారికి మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితిపై ‘ఈనాడు’ క్షేత్రస్థాయి పరిశీలనతో అందిస్తున్న కథనం.

చినుకు పడేదెన్నడు.. నేల తడిసేదెన్నడని రైతులు ఎదురుచూస్తున్నారు. వానజల్లు లేక పల్లెల్లో వ్యవసాయ పనులు ఊపందుకోలేదు. గతేడాది 16 జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులేర్పడ్డాయి. ఈ వానాకాలం (ఖరీఫ్‌) సీజన్‌లోనూ ప్రస్తుతం 27 జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులున్నాయి. ఈనెల ఇప్పటివరకూ ఆరు జిల్లాల్లో మాత్రమే సాధారణ స్థాయిలో వర్షాలు కురిశాయి. రాష్ట్ర సగటు వర్షపాతం 106.1 మిల్లీమీటర్ల (మి.మీ.)కు గాను 68.1 మి.మీ.లే కురిసింది. ఇది సాధారణంకన్నా 36 శాతం తక్కువ. కొన్ని జిల్లాల్లో అయితే సాధారణంకన్నా 60 నుంచి 70 శాతం వరకూ తక్కువ వర్షపాతం నమోదైంది. కాంక్రీట్‌ జంగిల్‌గా పేరొందిన హైదరాబాద్‌ జిల్లాలో సాధారణంకన్నా 7 శాతం అధిక వర్షపాతముంటే అడవుల జిల్లా ములుగులో సాధారణంకన్నా 70శాతం తక్కువ కురిసింది. వర్షాలు లేనందున విత్తనాలు, ఎరువులు కొనేందుకు రైతులు కూడా పెద్దగా ముందుకు రావడం లేదని జనగాం జిల్లా బచ్చన్నపేటకు చెందిన ఎరువుల వ్యాపారులు తెలిపారు. రైతుబంధు పథకం కింద ఇప్పటికే 33.70 లక్షలమంది రైతుల ఖాతాల్లో వ్యవసాయశాఖ రూ.3,430 కోట్లను జమచేసింది. సాగు ఖర్చులకు సొమ్ము చేతికందినా వర్షాలు లేక ఎదురుచూస్తున్నారు. ఈఏడాది కోటీ 28లక్షల టన్నుల ఆహార ధాన్యాల దిగుబడి సాధించాలని వ్యవసాయశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. కానీ వర్షాల ఆలస్యం వల్ల లక్ష్య సాధన కొంత కష్టంగానే కనిపిస్తోంది.
వడ్డీ కడితే పునరుద్ధరణ
గతేడాది ఖరీఫ్‌లో అంటే 2018 జూన్‌ 20న ఓ రైతు బ్యాంకు నుంచి రూ.లక్ష పంటరుణం తీసుకుంటే అతను తిరిగి 2019 జూన్‌ 19లోగా తిరిగి చెల్లిస్తే వడ్డీ కట్టనవసరం లేదని ‘వడ్డీ లేని పంటరుణం’ (వీఎల్‌ఆర్‌) పథకాన్ని వ్యవసాయశాఖ అమలుచేస్తోంది. కానీ దాదాపు అన్ని బ్యాంకులు వడ్డీ వసూలు చేస్తున్నాయి. ఏడాది క్రితం రూ.లక్ష పంటరుణం తీసుకున్న రైతు నుంచి 7 శాతం వడ్డీ కింద రూ.7,000 కట్టించుకుంటున్నట్లు జనగాం జిల్లా బచ్చన్నపేటలోని ఓ బ్యాంకు అధికారి తెలిపారు. ఈ వడ్డీ కట్టిన రైతు పాత బాకీ మొత్తం కట్టినట్లుగా రాసుకుని కొత్త పంటరుణం ఇస్తున్నట్లు తెలిపారు. పాత బాకీ కింద మొత్తం రూ.లక్షా ఏడు వేలు కట్టమని అడిగితే రైతులు ముందుకు రావడం లేదని, అందువల్ల వడ్డీ సొమ్ము రూ.7 వేలు కట్టించుకుని పాత బాకీ పూర్తిగా కట్టినట్లు రాసి, తిరిగి కొత్త రుణం ఇచ్చినట్లు మంజూరుచేసి పాతబాకీని వసూలులో చూపుతున్నట్లు చెప్పారు. కానీ రుణమాఫీ రాదేమోనన్న భయంతో చాలామంది రైతులు ఇలా వడ్డీ కట్టి రెన్యూవల్‌ చేసుకోడానికి కూడా ముందుకు రావడం లేదని సదరు అధికారి వివరించారు. దీనివల్లనే పంటరుణాల పంపిణీ చేయలేకపోతున్నట్లు వివరించారు. కొన్ని బ్యాంకుల్లో మాత్రమే పూర్తిగా బకాయి కట్టిన రైతులకే కొత్త రుణం ఇస్తున్నట్లు బ్యాంకు మేనేజర్లు తెలిపారు.
ఆదిలాబాద్‌, మంచిర్యాల, కుమురం భీం తదితర జిల్లాల్లో పంటరుణాల బాకీలను బ్యాంకులకు కట్టేందుకు వచ్చే పేద రైతులతోనూ కొందరు దళారులు వడ్డీ వ్యాపారం చేస్తున్నారు. ఒక రైతుకు బ్యాంకులో పాత బాకీ రూ.లక్ష ఉంటే అతనికి రూ. 2,000 వడ్డీకి వారంలోగా తిరిగి చెల్లించే ఒప్పందంతో దళారులు అప్పు ఇస్తున్నారు. ఆ సొమ్ము బ్యాంకులో కట్టేసి కొత్త రుణం వారంలోగా తీసుకుని సదరు దళారీకి రైతు చెల్లించాలనేది ఈ ఒప్పందాల సారాంశం.

ఉపాధి పనులూ లేవు..
వర్షాలు లేక వ్యవసాయ పనులు ఊపందుకోలేదు. పల్లెల్లో పనులు లేక ఉపాధి ఉండటం లేదని సిద్దిపేట జిల్లా లకుడారం గ్రామస్థులు ‘ఈనాడు’కు చెప్పారు. తమ గ్రామంలో గతేడాది, ఈ ఏడాది సరిగా వర్షాలు లేవని చెప్పారు.
కొత్త రుణాలకు వెళ్లని రైతులు

ఖరీఫ్‌ సీజన్‌ ఆరంభమై నెల కావస్తున్నా ఇంతవరకూ బ్యాంకుల్లో పంటరుణాల పంపిణీ జాడేలేదు. చాలా బ్యాంకుల్లో ఇంతవరకూ కొత్త రుణాలను రైతులు అడగటం లేదని అక్కడి సిబ్బంది చెబుతున్నారు
ఉదాహరణకు సిద్దిపేట జిల్లా ముస్త్యాలలోని ఎస్‌బీఐలో గతేడాది 600 మంది వరకూ రైతులు పంటరుణాలు తీసుకున్నారు. వీరిలో ఇప్పటివరకూ 45 మంది మాత్రమే పాత బాకీ కట్టి కొత్త పంటరుణం తీసుకున్నారని (రెన్యూవల్‌) బ్యాంకు అధికారి ఒకరు చెప్పారు. పాత బాకీ పూర్తిగా కట్టేందుకు రైతులు ముందుకు రావడం లేదని, రుణమాఫీ కింద ప్రభుత్వం నిధులు ఇస్తుందేమోనని ఎక్కువమంది ఎదురుచూస్తున్నారని ఆయన వివరించారు.